Begin typing your search above and press return to search.

యూఏఈలో టీ20 ప్రపంచ కప్ .. అసలు కారణం చెప్పిన 'దాదా' !

By:  Tupaki Desk   |   29 Jun 2021 3:56 AM GMT
యూఏఈలో టీ20 ప్రపంచ కప్ .. అసలు కారణం చెప్పిన దాదా !
X
కరోనా మహమ్మారి విజృంభణ నుండి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుముఖం పట్టాయి అని అనుకునేలోపే కొత్త కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటి అంటే .. టీ20 ప్రపంచ కప్ వేదికను బీసీసీఐ మార్చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ నవంబర్‌ లలో భారత్‌ లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు.

ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇప్పటికే అందించాం, టోర్నీతో ప్రమేయం ఉన్న అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని గంగూలీ చెప్పాడు. టోర్నీ జరిగేది యూఏఈలోనే అయినా ఆతిథ్యమిచ్చేది బీసీసీఐనే. అక్టోబరు 17న టోర్నీ ఆరంభాన్ని ఖరారు చేశారా అని అడగ్గా.. టోర్నీ షెడ్యూల్‌ తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. అక్టోబర్ 17న టోర్నీ ప్రారంభమనేది ఇంకా ఖాయం కాదు. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఒమన్‌ లో జరుగుతాయి. ప్రధాన టోర్నీ గ్రూప్ మ్యాచ్‌ లు యూఏఈలో ఉంటాయి అని గంగూలీ చెప్పాడు. ఐసీసీ ప్రతినిధి కూడా టోర్నీ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నాడు.

మరోవైపు ఏ పరిస్థితుల్లో ప్రపంచకప్‌ను తరలించాల్సి వచ్చిందో వివరిస్తూ అన్ని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖ రాశాడు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల సేఫ్టీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ తరలింపు నిర్ణయం తీసుకున్నాం. మెగా ఈవెంట్‌ ను భారత్‌ లో నిర్వహించాలని మేము కూడా భావించాం. కానీ తరలించక తప్పలేదు. యూఏఈ లో గత ఐపీఎల్‌ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ అనుభవంతో వరల్డ్‌ కప్ కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం కంఉంది అని జైషా అన్నాడు. ఇక వరల్డ్‌కప్‌ను యూఏఈ తరలించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని బోర్డు వర్గాలు చెప్తున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం. అలాగే , కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్కు వస్తారా, అన్నది రెండోది. యూఏఈలో టోర్నీ జరిగితే బీసీసీఐకి 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది.