Begin typing your search above and press return to search.

ఢిల్లీ మర్కజ్ ఘటన...విచారణకి హాజరైన తబ్లిగీ జమాత్ చీఫ్‌ కుమారుడు !

By:  Tupaki Desk   |   6 May 2020 7:50 AM GMT
ఢిల్లీ మర్కజ్ ఘటన...విచారణకి హాజరైన తబ్లిగీ జమాత్ చీఫ్‌ కుమారుడు !
X
లాక్ ‌డౌన్‌ తో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊరట పొందుతున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ మసీదులో ప్రార్థనల ఘటన సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మత సమావేశాలకు హాజరైన వారి కారణంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అని అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌ కుమారుడిని ఢిల్లీ క్రైమ్‌ బబ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం రెండు గంటల పాటు అతడిని ప్రశ్నించినట్టు హిందూస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌వద్ద పనిచేసిన 20 మంది ఆచూకీ అడిగినట్టు సమాచారం. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిన తర్వాత జమాత్‌ కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ 20 మంది కనిపించకుండా పోయారు. అయితే ,ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా వీరి గురించి పోలీసులకు తెలిసింది. వీరి ఫోన్ రికార్డులు, ఇమెయిల్‌ ల ద్వారా కీలక సమాచారాన్ని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం.

జమాత్‌ కార్యకలాపాల్లో మౌలానా సాద్‌ కుమారుడి ప్రమేయం ఉన్నందున పోలీసులు అతడిని విచారించారు. జమాత్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాల గురించి, అక్కడ పనిచేసే సిబ్బంది గురించి పోలీసులు ఆరా తీసినట్టు తెలిసింది. మౌలానా సాద్‌ కు మరోసారి కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించాలని అతడిని పోలీసులు ఆదేశించినట్టు సమాచారం. దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఈ మర్కజ్ ఘటనే కారణం అని విమర్శలు వస్తుండటంతో పోలీసులకు మౌలానా సాద్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, మర్కజ్‌ లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగడం లేదని ఆయన తరపు న్యాయవాది ఇంతకుముందు ప్రకటించారు.