Begin typing your search above and press return to search.

తాడేపల్లి అత్యాచార బాధితురాలికి ఇచ్చిన చెక్కు బౌన్స్.. ఎవరిని శిక్షించాలి?

By:  Tupaki Desk   |   1 July 2021 3:30 PM GMT
తాడేపల్లి అత్యాచార బాధితురాలికి ఇచ్చిన చెక్కు బౌన్స్.. ఎవరిని శిక్షించాలి?
X
ప్రభుత్వం ఎంత కమిట్ మెంట్ తో ఉన్నా.. పాలకులు తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరు అధికారుల కారణంగా లేనిపోని విమర్శలు చుట్టేస్తుంటాయి. కొన్ని విషయాల్లో తప్పులు జరగొచ్చు కానీ.. అందరి చూపు ఉన్న అంశాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఎక్కడ తప్పు జరగకూడదో అక్కడే నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావటమే కాదు.. పాలకులను ఇరుకున పడేస్తుంటారు కొందరు అధికారులు. ఏపీలో చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తాడేపల్లిఅత్యాచార ఉదంతం గురించి తెలిసిందే. కాబోయే భర్తతో కలిసి క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న పాపానికి.. దారుణ అత్యాచారానికి గురైన ఉదంతం షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అదే సమయంలో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని అధికారులు.. కీలక నేతలు పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల చెక్కును ఇచ్చారు. ఇదే సమయంలో గుంటూరు జిల్లా ఐసీడీఎస్ అధికారులు రూ.25వేల చెక్కును అందించారు. రెండు చెక్కుల్ని బాధితురాలి అకౌంట్లో వేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ5లక్షల చెక్కు నగదు రూపంలో బ్యాంకు ఖాతాలో జమైంది. అయితే.. జిల్లా ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన రూ.25 చెక్కు బౌన్స్ అయ్యింది.

దీంతో.. అప్రమత్తమైన బ్యాంకు అధికారులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అధికారులు నాలుక కొరుక్కొని.. అనుకోని రీతిలో తప్పు జరిగిందని.. రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి.. ఇందుకు బాధ్యుడైన అధికారి కంటే కూడా ప్రభుత్వానికే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్నది మర్చిపోకూడదు. ఈ ఉదంతం ప్రభుత్వ విభాగాల్లో హాట్ టాపిక్ గా మారింది.