Begin typing your search above and press return to search.

తాడిపత్రి.. అదే ఉత్కంట కంటిన్యూ అవుతోంది

By:  Tupaki Desk   |   17 March 2021 9:30 AM GMT
తాడిపత్రి.. అదే ఉత్కంట కంటిన్యూ అవుతోంది
X
ఏపీ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న మున్సిపల్ స్థానాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒకటి. ఛైర్మన్ గిరిని సొంతం చేసుకోవటానికి జేసీ కుటుంబం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా వెల్లడైన ఫలితం కూడా అధికార.. విపక్షానికి వచ్చిన స్థానాలు సమానంగా ఉండటం.. సీపీఎం.. ఇండిపెంట్ గా ఉన్న ఇద్దరు కీలకంగా మారటంతో.. ఛైర్మన్ ఎవరికి సొంతం అవుతుందన్నది ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున 18 మంది గెలిస్తే.. వైసీపీ తరఫున 16 మంది గెలిచారు. ఎవరైతే 19 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంటుందో.. వారే ఛైర్మన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

దీంతో అధికార వైసీపీకి ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు అవసరమైతే.. టీడీపీకి మరొక్క కౌన్సిలర్ మద్దతు మాత్రమే అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే.. తమ మద్దతుదారుల్ని వెంట పెట్టుకొని హైదరాబాద్ శివారులో క్యాంప్ వేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తమ వద్ద 20 మంది కౌన్సిలర్లు ఉన్నారని.. ఎవరూ చేజారే అవకాశం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..టీడీపీ ప్రతిపాదించే ఛైర్మన్ అభ్యర్థికే తాను మొదట్నించి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీశ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ కు ముందుగానే విప్ సమర్పించారు. దీంతో.. టీడీపీకి తాడిపత్రి ఛైర్మన్ గిరి దక్కే అవకాశం ఉంది. అయితే..చివర్లో వైసీపీ చక్రం తిప్పి.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. మిగిలిన మున్సిపల్ ఛైర్మన్ స్థానాలతో పోలిస్తే.. తాడిపత్రి ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారిందని చెప్పక తప్పదు.