Begin typing your search above and press return to search.

తాజ్‌ మ‌హ‌ల్ దేవాల‌య‌మే..గుడి క‌ట్టేస్తాం

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:08 PM GMT
తాజ్‌ మ‌హ‌ల్ దేవాల‌య‌మే..గుడి క‌ట్టేస్తాం
X
తాజ్‌ మహల్‌ పై చర్చ - వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలతో తాజ్‌ మహల్ వివాదం రగులుకోగా తాజాగా తాజ్ దేవాల‌యం అనే ఎపిసోడ్ మ‌ళ్లీ తెరమీద‌కు వ‌చ్చింది. తాజ్‌ మహల్‌ పై బీజేపీ ఎంపీ వినయ్‌ కతియార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్‌ గా ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని కూల్చేసిన మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తాజ్‌ మహల్‌ నిర్మించాడని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మ‌ళ్లీ అవే కామెంట్లు చేశారు.

తాజ్‌ మహల్‌ ను తాజ్‌ మందిర్‌ గా మారుస్తామని ఎంపీ విన‌య్ క‌తియార్‌ ప్రకటించారు. దేశంలో అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటైన తాజ్‌ మహల్‌ ను హిందువులే నిర్మించినందున దాన్ని గుడిలా మారుస్తామని చెప్పారు. అలా మార్చ‌డ‌మే సరైన‌దని విన‌య్ పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌ళ్లీ దుమారం మొద‌లైంది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌మాజ్‌ వాదీ పార్టీ - కాంగ్రెస్ ఆరోపించాయి.

కాగా, తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయం అని గ‌తంలో క‌ల‌క‌లం రేకెత్తించిన విన‌య్...అదే రీతిలో ఢిల్లీలోని జామా మసీదు ఒకప్పుడు జమునా దేవీ ఆలయం అని తెలిపారు. మొగల్ చక్రవర్తులు సుమారు 6000 స్థలాల్లో ఉన్న ఆలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంటున్నదన్నారు. తాజ్ మ‌హ‌ల్‌ దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం అని బీజేపీ ఎమ్మెల్యే సోమ్ చేసిన కామెంట్స్‌ పై క్లారిటీ ఇస్తూ...విన‌య్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.