Begin typing your search above and press return to search.

జ్ఞానవాపి సర్వే: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా సంచలనం

By:  Tupaki Desk   |   19 May 2022 5:29 AM GMT
జ్ఞానవాపి సర్వే: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా సంచలనం
X
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్తానాలకు చేరింది. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని ఆలయాలను కూల్చివేసి మసీదులను కట్టలేదని.. పెద్దసంఖ్యలో జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఇలాంటి మసీదులను ప్రభుత్వాలు ముట్టుకోరాదని తాఖీర్ హెచ్చరించారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందన్న ప్రచారం.. హిందూయిజాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. అయితే ఈ ఆలయాలను కూల్చలేదని చెప్పారు. వాటిని కేవలం మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని.. కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు.

ముస్లింలు ఎవరూ న్యాయపోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నాడు.

విద్వేషవాదులు తలుచుకుంటే దేశంలో ఏదైనా జరుగుతుందని తాఖీర్ తెలిపారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారని తెలిపారు. తాఖీర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు.

-అసలు వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

మొగల్ చక్రవర్తుల కాలంలో ఔరంగజేబు పాలనలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనుకాల దేవాలయానికి సంబంధించిన స్తంభాలు ఉండడంతో హిందువుల దేవాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఆరోపిస్తున్నారు.

కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలున్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. కోర్టు కలుగజేసుకొని దీనిపై వీడియోగ్రఫీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేవించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇది హిందువులకు చెందుతుందా? మసీదుగానే పరిగణిస్తారా? అన్నది వేచిచూడాలి.