Begin typing your search above and press return to search.

ఈ దెబ్బ‌తో చైనాకు దిమ్మ‌తిరిగిపోతుంద‌ట‌

By:  Tupaki Desk   |   18 Aug 2017 4:37 PM GMT
ఈ దెబ్బ‌తో చైనాకు దిమ్మ‌తిరిగిపోతుంద‌ట‌
X
స‌రిహ‌ద్దులో స‌వాలు విసురుతున్న చైనాను ఆర్థికంగా దెబ్బ‌తీయాల‌ని భార‌త్ చూస్తోంది. ఇప్ప‌టికే చైనా ఎల‌క్ట్రానిక్స్‌ - ఐటీ దిగుమ‌తుల‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్న ఇండియా.. ఇప్పుడు విద్యుత్‌ - టెలికాం రంగాల్లో నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. ఈ రెండు రంగాల్లోనూ చైనా కంపెనీల హ‌వా క‌నిపిస్తుంది. హార్బిన్ ఎల‌క్ట్రిక్‌ - డాంగ్‌ ఫాంగ్ ఎల‌క్ట్రానిక్స్‌ - షాంఘై ఎల‌క్ట్రిక్‌ - సిఫాంగ్ ఆటోమేష‌న్ కంపెనీలు ఇండియాలోని 18 న‌గ‌రాల్లో ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ నిర్వ‌హ‌ణ లేదా దానికి అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను స‌ప్లై చేస్తున్నాయి. భద్ర‌త కార‌ణాల‌ను చూపుతూ విద్యుత్ రంగంలో చైనా కంపెనీల హ‌వాను స్థానిక కంపెనీలు ఎప్ప‌టి నుంచో ప్ర‌శ్నిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డోక్లామ్ రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో స‌మ‌యం చూసి చైనీస్ కంపెనీల‌ను దెబ్బ కొట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

స్థానిక కంపెనీల‌కు అనుకూలంగా ఉండేలా విద్యుత్ రంగంలో కొత్త నిబంధ‌న‌ల‌ను త‌యారుచేసింది సెంట్ర‌ల్ ఎల‌క్ట్రిసిటీ అథారిటీ. ప్ర‌స్తుతం ఈ నిబంధ‌న‌ల‌ను కేంద్రం ప‌రిశీలిస్తున్న‌ది. కొత్త నిబంధ‌నల ప్రకారం.. ఇండియాలో పెట్టుబ‌డులు పెట్టే సంస్థ‌లు ఇక్క‌డ క‌నీసం ప‌దేళ్లుగా త‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండాలి. భార‌త పౌరులే ఈ సంస్థ‌ల్లో అత్యున్న‌త స్థానాల్లో ఉండాలి అన్న నిబంధ‌న‌ల‌ను కొత్త‌గా చేర్చారు. అంతేకాదు కంపెనీలు తాము స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ కోసం కావాల్సిన ప‌రిక‌రాల‌ను ఎక్క‌డి నుంచి తీసుకుంటున్నారో కూడా వివ‌రించాల్సి ఉంటుంది. చైనా ల‌క్ష్యంగానే ఈ క‌ఠిన నిబంధ‌న‌ల‌ను రూపొందించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వంలోని ఓ సీనియ‌ర్ అధికారి మీడియాకు వెల్ల‌డించారు.

అటు చైనా కంపెనీల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న‌ టెలికాం రంగంలోనూ ఇలాంటివే క‌ఠిన నిబంధ‌న‌ల‌ను రూపొందించారు. స్మార్ట్‌ ఫోన్స్ త‌యారు చేసే 21 కంపెనీల‌కు కేంద్ర స‌మాచార శాఖ ఇప్ప‌టికే కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఇందులో చైనీస్ కంపెనీలే ఎక్కువ‌. మీ దేశంలో ఫోన్ల త‌యారీలో తీసుకుంటున్న భ‌ద్ర‌తా చ‌ర్య‌లు - మార్గ‌ద‌ర్శ‌కాలు - ప్ర‌మాణాలులాంటి విష‌యాల‌న్నీ వెల్ల‌డించాల‌న్న‌ది ఆ ఆదేశాల సారాంశం. భార‌త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ లో చైనీస్ కంపెనీలు షియోమీ - లెనొవో - ఒప్పొ - వివో - జియోనీల‌కే 50 శాతానికిపైగా షేర్ ఉంది.