Begin typing your search above and press return to search.

తండ్రుల‌ది క‌త్తులాట‌!... త‌న‌యుల‌ది జ‌ల్సాలాట‌!

By:  Tupaki Desk   |   11 May 2019 4:18 AM GMT
తండ్రుల‌ది క‌త్తులాట‌!... త‌న‌యుల‌ది జ‌ల్సాలాట‌!
X
రాజ‌కీయం - బంధుత్వం... రెండు ఒక ఒర‌లో ఉండ‌లేవంటూ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అప్పుడెప్పుడో పార్టీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఒక్క చంద్ర‌బాబే కాదులెండి... ఏ పార్టీ అధినేత అయినా... త‌మ పార్టీకి చెందిన ఎవ‌రైనా నేత‌... వైరి వ‌ర్గానికి చెందిన నేత‌తో స‌ఖ్య‌త‌గా ఉంటే స‌హించ‌లేర‌నే చెప్పాలి. ఎందుకంటే... పార్టీ ప్ర‌యోజ‌నాలు ఎక్క‌డ దెబ్బ తింటాయోనన్న‌ది వారి ఆందోళ‌న‌. స‌రే.. ఎంతైనా అధినేత‌లు నిర్దేశించిన గీత‌ను దాట‌కుండానే బంధుత్వాన్ని ఇళ్ల‌కే ప‌రిమితం చేసుకుని బ‌య‌ట‌కొచ్చేస‌రికి రాజ‌కీయ వైరుధ్యాన్ని కొన‌సాగించారు చాలా మంది నేత‌లు. అయితే అది ఇంటి పెద్ద‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైపోయింది. వారి పిల్ల‌ల విష‌యానికి వ‌స్తే... మాత్రం రాజ‌కీయం - బంధుత్వాన్ని ప‌క్క‌న‌పెట్టేసి స్నేహ గీతం పేరిట జ‌ల్సాలు చేసుకుంటున్నారు.

ఈ త‌ర‌హా వైరుధ్యానికి ఇప్పుడు ఓ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ దొరికింది. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ నేత‌గా - కేసీఆర్ కేబినెట్ వ‌రుస‌గా రెండో సారి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గుర్తున్నారుగా. టీడీపీతోనే రాజ‌కీయం ప్రారంభించిన త‌ల‌సాని... ఆ త‌ర్వాత టీఆర్ ఎస్ లోచేరిపోయారు. టీడీపీకి బ‌ద్ధ విరోధిగా మారిపోయారు. ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న సామాజిక వ‌ర్గాన్ని స‌మీక‌రించి టీడీపీ ఓట‌మి కోసం భారీగానే శ్ర‌మించారు. ఇక ఇప్పుడు ఏపీలోకి వ‌స్తే... మొన్న‌టిదాకా టీటీడీ చైర్మ‌న్ గా ఉండి... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ గుర్తున్నారు క‌దా. త‌న సామాజిక వ‌ర్గమే కాకుండా బంధువు కూడా అయిన త‌ల‌సానితో ఆయ‌న చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ త‌ర‌హా సంద‌ర్భాల్లోనే రాజ‌కీయం - బంధుత్వాల‌ను వేరుగా చూడాలంటూ చంద్ర‌బాబు గుర్రుమ‌న్నారు. స‌రే... ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పుట్టా బ‌రిలోకి దిగితే... టీడీపీ ఓట‌మికి తాను ఎంత చేయాలో అంత‌మేర త‌ల‌సాని చేశారు. మొత్తంగా బంధువులైన వీరు రాజ‌కీయంగా శ‌త్రువుల కిందే లెక్క‌.

అయితే వీరి పుత్ర‌ర‌త్నాలు మాత్రం రాజ‌కీయాల్లో ఉన్నా కూడా రాజ‌కీయం... రాజ‌కీయ‌మే, బంధుత్వం... బంధుత్వ‌మే, స్నేహం... స్నేహ‌మేనంటూ ఏకంగా జ‌ల్సా చేసేస్తున్నారు. త‌ల‌సాని త‌న‌యుడు సాయి కిర‌ణ్ యాద‌వ్ ఇటీవ‌ల పోలింగ్ ముగిసిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ప్ర‌చారంలో య‌మా బిజీగా గ‌డిపారు. అటు పుట్టా త‌న‌యుడు పుట్టా ర‌వి తండ్రి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తించారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే వీరిద్ద‌రూ... త‌మ స్నేహితుడైన సినీ డిస్ట్రిబ్యూట‌ర్ అభిషేక్ నామాతో క‌లిసి మ‌కావు ఫ్లైటెక్కేశారు. ఎర్ర‌టి ఎండ‌లో చెమ‌ట‌లు కక్కుతూ ప్ర‌చారం చేసిన వీరిద్ద‌రూ.. ఎన్నిక‌లు ముగియ‌గానే.. మ‌కావు వెళ్లి సేద‌దీరారు. ఇక కౌంటింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో జ‌ల్సా ట్రిప్ ను ముగించుకున్న వీరు తిరిగి వ‌చ్చేశార‌ట‌. మొత్తంగా తండ్రుల మ‌ధ్య రాజ‌కీయ పోరు సాగితే.. త‌న‌యులు మాత్రం జ‌ల్సాల్లో మునిగితేలుతున్నార‌న్న మాట‌.