Begin typing your search above and press return to search.

త‌ల‌సాని.. సార్ ను అడిగి మాట్లాడు త‌ల‌సాని

By:  Tupaki Desk   |   21 Sep 2018 6:01 AM GMT
త‌ల‌సాని.. సార్ ను అడిగి మాట్లాడు త‌ల‌సాని
X
రాజ‌కీయాల్లో ఒక ద‌శ వ‌ర‌కే సంయ‌మ‌నం ఉంటుంది. అది దాటేసిందా? ఎవ‌రూ ఎవ‌రిని ఆపే ప‌రిస్థితి ఉండ‌దు. అలాంటి ప‌రిస్థితికి కార‌ణ‌మైన వారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి త‌ప్పే తాజా మాజీ మంత్రి త‌ల‌సాని చేస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

టీఆర్ ఎస్‌.. బీజేపీల మ‌ధ్య బంధంపై ప‌లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా కేటీఆర్ వ్యాఖ్య‌లు చేయ‌టం.. దీనికి కౌంట‌ర్ ఇచ్చేలా అమిత్ షా మాట్లాడ‌టంతో అప్ప‌టివ‌ర‌కూ టీఆర్ ఎస్‌.. బీజేపీల మ‌ధ్య స్నేహం చిక్కుల్లో ప‌డింద‌న్న వాద‌న‌లు వినిపించాయి.

మ‌రోవైపు ఇలా ప‌రుష వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా.. డ్రామాను మ‌రింత పెంచుతున్నార‌న్న అభిప్రాయాన్ని మ‌రికొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వేళ తెలంగాణ తాజా మాజీ మంత్రి త‌ల‌సాని చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముంద‌స్తు నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ .. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే పార్టీ అభ్య‌ర్థులు వీరేనంటూ ఏకంగా 106 మంది పేర్ల‌ను ప్ర‌క‌టించ‌టం ఒక ఎత్తు అయితే.. పేర్లు ప్ర‌క‌టించని 14 పేర్ల‌లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఐదు సీట్ల‌లో నాలుగు ఉండ‌టం గ‌మ‌నార్హం.ప్ర‌క‌టించిన ఒక్క సీటులోనూ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని ప్ర‌క‌టించార‌న్న అభిప్రాయం ఉంది.

అయితే.. ఈ త‌ర‌హా వాద‌న‌ల్ని టీఆర్ ఎస్ ముఖ్య నేత‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇలాంటివి పెద్ద విష‌యాలు కాద‌న్న‌ట్లుగా వారి తీరు ఉన్నా.. ఈ సందేహం టీఆర్ఎస్ సంప్ర‌దాయ ఓట‌రు మీద ప్ర‌భావం చూప‌టంతో పాటు.. మైనార్టీల మీద కొత్త‌సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా బీజేపీతో వ్య‌వ‌హారం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. తాజా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ లాంటోళ్లు ఈ వ్య‌వ‌హారంలో త‌ల‌దూరుస్తూ.. ఈసారి బీజేపీకి ఒక్క సీటు కూడా రాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసే ముందు పార్టీ లైన్ తెలుసుకొని.. పార్టీ అధినేత కేసీఆర్ మ‌న‌సు ఎరిగి మాట్లాడారా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. అమిత్ షాను భ్ర‌మిత్ షా లాంటి వ్యాఖ్య‌లు కేటీఆర్ చేస్తే కేసీఆర్ కు పెద్ద అభ్యంత‌రం ఉండ‌దు. కానీ.. అదే మాట‌ను గులాబీ బ్యాచ్ కు చెందిన నేత‌లు ఎవ‌రైనా అన‌గ‌ల‌రా? అలా అంటే.. త‌ర్వాత ఎలాంటి విప‌రిణామాలు చోటు చేసుకుంటాయో తెలియంది కాదు. మ‌రి.. ఇలాంటివేళ‌.. తొంద‌ర‌ప‌డి మాట్లాడి త‌ల‌నొప్పులు తెచ్చుకునే క‌న్నా.. ముంద‌స్తుగా ప‌ర్మిష‌న్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందేమో త‌ల‌సాని?