Begin typing your search above and press return to search.

తలసాని నోటి వెంట అభ్యంతరకర భాష

By:  Tupaki Desk   |   25 Jun 2015 3:54 AM GMT
తలసాని నోటి వెంట అభ్యంతరకర భాష
X
ఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకీ మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ఠ్రాల అధికారపక్షాల మధ్య విపరీతమైన అలజడిని రేపుతున్న ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి.

చంద్రబాబు పేరు ఎత్తితే చాలు.. శివాలెత్తే తలసాని.. ఈసారి ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఏసీబీ తీరుపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తలసాని.. ఏసీబీ జారీ చేసే నోటీసులు తీసుకోకుంటే.. చంద్రబాబును మెడ పట్టి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా తనకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అధికారం లేదని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యకు కౌంటర్‌గా తలసాని ఈ తీవ్ర వ్యాఖ్య చేశారు. నేతలు ఎవరైనా.. ఎవరినైనా ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారి తీస్తాయే తప్పించి మరొకటి కాదు. ఏసీబీ ఇచ్చే నోటీసులు తీసుకోకుంటే.. చట్టప్రకారం ఏం చేయాలో అది చేయాలే తప్పించి.. అంతకు మించి అలా చేస్తాం.. ఇలా చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు ఏ పక్షానికి మంచిది కాదన్న విషయం ఎప్పటికి అర్థం అవుతుందో..?