Begin typing your search above and press return to search.

ఆంధ్రాకి లక్ష ఇచ్చి.. మాకు పదివేలు ఇస్తారా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 2:09 PM GMT
ఆంధ్రాకి లక్ష ఇచ్చి.. మాకు పదివేలు ఇస్తారా?
X
విషయం ఏదైనా ఏపీతో పోల్చుకోవటం.. ఏపీకి ఎన్ని ఇచ్చారు? మాకు ఎన్ని ఇచ్చారంటూ లెక్కలు అడగటం తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష నేతలకు అలవాటే. అలాంటి అలవాటునే మరోసారి బయటపెట్టారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి సంబంధించి తాజాగా కేంద్రం ఐదు రాష్ట్రాలకు ఇళ్లను కేటాయించటం.. దీన్లో ఏపీకి పెద్దపీట వేయటం తెలిసిందే.

ఈ విషయాన్ని ప్రస్తావించిన మంత్రి తలసాని.. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపిందని వ్యాఖ్యానించారు. ఏపీకి లక్షకు పైగా ఇళ్లు ఇచ్చి.. తెలంగాణకు పదివేల ఇళ్లు మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల అన్నింటిపట్ల సమానంగా వ్యవహరించాలని.. వివక్ష చూపకూడదని వ్యాఖ్యానించారు. తలసాని చెప్పింది కాసేపు నిజమే అనుకుంటే.. దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ ఒకేలా ఉండాలి కదా? కానీ.. తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే సంపన్న రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి? ఏపీతో ప్రతి విషయంలో పోటీ పెట్టుకునే తెలంగాణ అదికరాపక్ష నేతలు.. తెలంగాణకు హైదరాబాద్ లాంటి మహా నగరం ఉందని.. ఏపీకి మరి అలాంటి నగరం ఏమీ లేదు కదా? అలా ఎందుకు జరిగిందో సమాధానం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశం మొత్తమ్మీదా పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది కేవలం ఐదు రాష్ట్రాలే అన్న విషయాన్ని మంత్రి తలసాని మర్చిపోకూడదు. కానీ.. ఆ విషయాన్ని వదిలేసి.. వివక్ష పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం గమనార్హం. రెండు తెలుగురాష్ట్రాల్లో ఏపీ బీద రాష్ట్రంగా ఉండిపోతే.. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఎలా ఉండిపోయింది? అంతదాకా ఎందుకు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వార్షిక ఆదాయంతో పోలిస్తే.. ఏపీలోని కొన్ని నగరాలు కలిపినా ఆ మొత్తం వస్తాయా? అలాంటప్పుడు.. తలసాని మాట్లాడినట్లుగా.. తెలంగాణకు అన్ని ఉన్నాయి? ఏపీకి ఎందుకు లేవని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారో..?