Begin typing your search above and press return to search.

నాలుగు ఓట్ల కోసం చిల్లరవేషాలా బాబూ

By:  Tupaki Desk   |   13 April 2019 8:34 AM GMT
నాలుగు ఓట్ల కోసం చిల్లరవేషాలా బాబూ
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చంద్రబాబు తెలంగాణలోని ఆంధ్రులను అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తే మరింత దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పందించారు. చంద్రబాబు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని - ఆయన నిజాయితీ పరుడైతే తెలంగాణలోని తన ఆస్తులన్నీ అమ్ముకొని పోవాలని సవాల్ చేశారు. నిద్రలో కూడా కేసీఆర్ ను బాబు కలవరిస్తున్నారని.. మామ ఎన్టీఆర్ ను ఎప్పుడో మరిచిపోయాడని ధ్వజమెత్తారు.బాబు తీరు చిల్లర వ్యక్తులకన్నా అధ్వానంగా ఉందని విమర్శించారు.

ఏపీపై అంత ప్రేమ ఉంటే తెలంగాణలోఆస్తులు ఎందుకు ఉంచుకుంటున్నావని బాబును తలసాని విమర్శించారు. నిజంగా బాబుకు ఏపీలోని ప్రజలతోనే ఉండాలనుకుంటే తెలంగాణవైపు చూడొద్దన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి ఇక్కడున్న ఆంధ్రులను రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణలోని సెటిలర్లకు ఎప్పుడో ఇక్కడి ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, అది గత ఎన్నికల్లోనే రుజువు చేశారన్నారు.

మొన్నటి ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాటకాలు ప్రదర్శించారని - ఆయన కుమారుడు లోకేశ్‌ తో కలిసి ఎన్నో కుట్రలు పన్నారన్నారని తలసాని ఫైర్ అయ్యారు. మంగళగిరిలో లోకేశ్‌ కావాలనే ఆందోళన చేశాడని, అవి అర్థంపర్థం లేని ఆందోళనలన్నారు. అటు సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సైతం నాటకాలాడుతూ ప్రజలను అయోమయానికి గురిచేశారాన్నారు.

ఒకటి, రెండు చోట్ల ఆందోళనలు జరిగితే రాష్ట్రం మొత్తం అల్లర్లు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మార్చారన్న బాబు వ్యాఖ్యలపై తలసాని తప్పుపట్టారు. ఎన్నికల చీఫ్‌ సెక్రటరీ ఓ ఏజెంట్‌ అని, ఆయనపై కేసులున్నాయని బాబు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నో కేసులు మీదేసుకున్న బాబు మరొకరిని కేసులు ఉన్నాయని నిందించడం సిగ్గుచేటన్నారు.