Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంటున్న త‌ల‌సాని

By:  Tupaki Desk   |   29 July 2017 3:54 PM GMT
ప్ర‌తిప‌క్షం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంటున్న త‌ల‌సాని
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అధికార పార్టీపై కాంగ్రెస్ నేత‌లు చిల్లర కామెంట్లు చేస్తున్నార‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మండిప‌డ్డారు. కంపెనీలను ప్ర‌స్తావిస్తూ..కుటుంబ రాజ‌కీయాలంటూ కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చిత్రంగా ఉంద‌ని అన్నారు. మంత్రి కేటీఆర్‌ కు హిమాన్షు మోటార్స్ ఉన్న మాట వాస్తవమ‌ని మంత్రి త‌ల‌సాని అంగీక‌రించారు. కానీ కొన్ని ఏండ్ల నుంచి వ్యాపారం చేయటం లేదని కేటీఆర్ స్పష్టత ఇచ్చిన‌ప్ప‌టికీ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. హిమాన్షు కంపెనీలో ఏమైనా లావాదేవీలు జరిగిన‌ ఆధారాలుంటే బయట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పా అని త‌ల‌సాని నిల‌దీశారు. కాంగ్రెస్ పార్టీ ఆరాధిస్తున్న జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు నుంచి ప్రియాంక గాంధీ వరకు ఎక్క‌డి నుంచి వచ్చారని నిల‌దీశారు. తెలంగాణ రాకముందే కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నారనే సంగతి తెలియదా అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. దేశంలో దరిద్రమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అంటూ మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతల చరిత్ర త‌మ దగ్గర ఉంద‌ని అన్నారు. హ‌స్తం పార్టీ నేత‌లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు. ప్రతిపక్షాల పై ప్రజలు తిరగబడే రోజు వస్తే తాము చేసేదేమీ లేదని త‌ల‌సాని అన్నారు.

మంత్రి కేటీఆర్ అంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సిరిసిల్ల కు పోయి పొడిచేది ఏందని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. సిరిసిల్లలోని ఇసుక మాఫియాను అంత మోదించేందుకు ప్రభుత్వమే 200 కేసులు పెట్టిందని తెలిపారు. త‌మ మీద పోరాటం చేసే సత్తా మరో పదేండ్ల వరకు కాంగ్రెస్ కు రాదని త‌ల‌సాని అన్నారు. అసెంబ్లీ లో కాని ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం.. బలహీన వర్గాల కోసం మీరేం చేశారు...మేమేం చేశామో చర్చిద్దామా అని స‌వాల్ విసిరారు. తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండరాం రాజకీయాల్లోకి రావాలంటే రావొచ్చు కానీ ముసుగు వేసుకొని విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. భూసేకరణ జరపకుండా ప్రాజెక్టులు కట్టాలి అనటం విచిత్రంగా ఉంద‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఎద్దేవా చేశారు.