Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఏకవచనంతో పిలిస్తే ఊరుకోరట

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:30 PM GMT
కేసీఆర్ ను ఏకవచనంతో పిలిస్తే ఊరుకోరట
X
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించి తెలంగాణలో గడిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనల పట్ల గులాబీ దళం ఎంత ఆగ్రహంగా ఉందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మాటలతో చెప్పేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ ను ఏకవచనంతో సంభోదిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చిన తలసాని.. అలాంటి వారిపై చర్యలు తప్పవన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేసీఆర్ పని చేస్తున్నారని.. అలాంటి సీఎంను విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు. గద్వాల.. జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ ఎందుకు కోరలేదని ప్రశ్నించిన తలసాని.. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవటంపై బీజేపీ విమర్శించటం సరికాదన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరుగుతుందని చెప్పిన తలసాని.. తెలంగాణ సర్కారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే జైల్లో పెట్టి పనులు చేస్తామని తేల్చేశారు. ఆవేశం మంచిదే.. కానీ దాని హద్దులు దాటకూడదన్న విషయాన్ని తలసాని మర్చిపోయినట్లున్నారు. ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ పవర్ తలకెక్కటాన్ని ఏ మాత్రం ఇష్టపడరు. కేసీఆర్ ను విమర్శించటం.. ఏకవచనంతో పిలిస్తే ఒప్పుకోమన్న తలసాని లాంటి వారు.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎంతమేర గౌరవిస్తున్నారన్న విషయం గురించి ఆలోచిస్తే మంచిది. అభివృద్ధికార్యక్రమాలకు అడ్డుపడితే జైల్లో పెట్టి పనులు చేస్తామని చెబుతున్న తలసాని.. ఈ తరహా మాటలు చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా ఉంది. అహంభావం.. అహంకారం రెండూ అధికారానికి పెద్ద శత్రువులన్న విషయాన్ని తలసాని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.