Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటలు తలసానికి మాత్రమే సాధ్యం బాస్

By:  Tupaki Desk   |   8 July 2020 6:45 AM GMT
ఇలాంటి మాటలు తలసానికి మాత్రమే సాధ్యం బాస్
X
ఉత్త పుణ్యానికే ఒక మాట అనేయటానికి ముందు వెనుకా ఆడతాం. రాజకీయాల్లో అలాంటివి పెద్దగా కనిపించవు. కొన్నేళ్లుగా నడస్తున్న దూకుడు రాజకీయాల్లో మొహమాటాలు అస్సలు ఉండవు. ఎంత మాట అయినా వెనుకా ముందు చూసుకోకుండా అనేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. గతంలో దూకుడు రాజకీయాలు కొందరు నేతలకే పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం వాళ్లు .. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ అదే బాటలో పయనిస్తున్నారు. మరి ఇలాంటి వేళ.. ఫైర్ బ్రాండ్ నేతల మాటేమిటి? అన్న విషయంలోకి వెళితే.. మిగిలిన వారి కంటే ఆరు ఆకులు ఎక్కువ చదివే ఫైర్ బ్రాండ్ నేతలు దూకుడు కొత్త పాఠాలు నేర్పించేలా నోటికి పని చెబుతున్నారు.

సచివాలయాన్ని కూల్చేస్తున్న వైనంపై విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తీవ్రంగా ఎండగడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో.. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు పలువురు స్పందించారు. అలా స్పందించిన వారిలో పలువురు మంత్రులు ఉన్నారు. హరీశ్ లాంటోళ్లు సెంటిమెంట్ సెంటు బయటకు తీస్తే.. మంత్రి తలసాని మాత్రం అందుకు భిన్నంగా విపక్షనేతలపై ఫైర్ అయ్యారు.

ఆరునూరైనా.. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా సచివాలయాన్ని కట్టి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే..మెడలు పట్టి లోపలేస్తామని వార్నింగ్ ఇచ్చేశారు. సచివాలయం అంటే పవిత్ర స్థలమని.. అక్కడ పడావు పడిన భవనాలు ఉన్నాయని.. కొత్త సచివాలయం నిర్మించాలన్నది కొత్త నిర్ణయం ఏమీ కాదన్న ఆయన.. ధనికరాష్ట్రానికి బ్రహ్మాండమైన సచివాలయం ఉండాలని ఎన్నికలు ముందే చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తీరును విపక్షాలు తప్పు పట్టటం కొత్తేం కాదు. కానీ.. విమర్శలు చేస్తే చర్యలు.. ఆందోళనలకు అరెస్టులు.. ఇప్పటికే అలవాటైనా.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మెడలు వంచి లోపలేస్తామన్న డైరెక్టు వార్నింగ్ మాత్రం తలసాని స్పెషల్ గా చెప్పక తప్పదు. ఈ తరహా వ్యాఖ్యలు తలసాని లాంటి వారికే సాధ్యమని చెప్పక తప్పదు.