Begin typing your search above and press return to search.

ఆది రాజీనామాలో, తలసాని స్ఫూర్తి ఉంటుందా?

By:  Tupaki Desk   |   1 Oct 2015 10:30 PM GMT
ఆది రాజీనామాలో, తలసాని స్ఫూర్తి ఉంటుందా?
X
'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అని సినిమా పాట మనకు చెబుతుంది. కానీ ఈరోజుల్లో ఆడవారి సంగతేమోగానీ.. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని మాత్రం ఖచ్చితంగా అనుకోవాల్సిన పరిస్థితి. అనుమానించాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు పైకి ఒక మాట చెప్పారంటే.. దాని వెనుక హిడెన్‌ మాటలు ఇంకేమైనా ఉన్నాయేమో అని ప్రజలే అనుమానిస్తున్నారు. ఒక పార్టీ ఒక ఉద్యమాన్ని ప్రారంభించినదంటే.. ప్రకటిత ఎజెండా కాకుండా, హిడెన్‌ ఎజెండా ఇంకేమైనా ఉన్నదేమో అనుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ అలాంటి అనుమానాలు పుడుతున్న ప్రజలకు ఇప్పుడు కడపజిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసేస్తా అంటే కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైకాపాకు చెందిన నాయకుడు. ఆయన చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్‌ మీద విమర్శలు సంధిస్తున్నారు. పార్టీని వీడిపోవడం గ్యారంటీ అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. మధ్యలో కొన్నాళ్లు భాజపా వైపు వెళ్లవచ్చుననే ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఆయన చూపు తెలుగుదేశం వైపు ఉన్నట్లుగా అంతా చెప్పుకుంటున్నారు. ఇక ముహూర్తం ఖరారు కావడం ఒక్కటే తరువాయి అని, ఆయన తెదేపా లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో.. ఆదినారాయణ రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. తాను, పార్టీ మారేట్లయితే.. ముందుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తానని వెల్లడించారు. ఒక పార్టీ మీద గెలిచి, ఆ తర్వాత అధికార పార్టీల్లోకి ఫిరాయించిన వారి వ్యవహారాలు, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నానా గందరగోళంగా ఉండగా.. తన పార్టీ ఫిరాయింపు కూడా అలాంటి వివాదానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఆదినారాయణరెడ్డి ఇలా ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేసేస్తానని అంటున్నారా.. అని ప్రజలు భావిస్తున్నారు.

అయితే కొందరిలో కలుగుతున్న అనుమానం ఏంటంటే.. ఆదినారాయణరెడ్డి రాజీనామాకు, తలసాని రాజీనామా స్ఫూర్తిగా నిలుస్తున్నదా? అని!! తలసాని కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గానీ.. నెలలు గడచిపోతున్నా.. ఆయన రాజీనామాను స్పీకరు మాత్రం ఆమోదించలేదు. రాజీనామా ఆమోదం అనేది.. పూర్తిగా స్పీకరు విచక్షణకు సంబంధించిన వ్యవహారం. కాబట్టి.. తలసాని యథేచ్ఛగా ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతున్నారు. ఆదినారాయణరెడ్డి రాజీనామా చేసినాకూడా చేరేది అధికార పార్టీలోనే గనుక.. అక్కడ స్పీకరు చల్లగా చూసుకుంటే.. ఆ రాజీనామా ఆమోదం పొందకుండానే.. ఈ నాలుగేళ్లూ గడిపేస్తారేమోనని.. తలసాని స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారేమోనని పలువురు సందేహిస్తున్నారు.