Begin typing your search above and press return to search.

కొత్తకోణం; సొంతోళ్లే తలసానిని బుక్ చేశారా?

By:  Tupaki Desk   |   21 July 2015 4:27 AM GMT
కొత్తకోణం; సొంతోళ్లే తలసానిని బుక్ చేశారా?
X
రాజకీయాల్లో సాధ్యం కానిది.. అసాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. కేవలం అవసరం.. సమయం మాత్రమే కీలకభూమిక పోషిస్తాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని యవ్వారం రచ్చ.. రచ్చగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారును ఆత్మరక్షణలో పడేసేందుకు విపక్షాలకు దొరికిన ఏకైక ఆయుధం తలసాని వ్యవహారం మాత్రమే. మిగిలిన ఏ ఇష్యూ పైన అయినా సరే.. గుక్క తిప్పుకోకుండా మాట్లాడే గులాబీ నేతలు.. తలసాని ఇష్యూలో మాత్రం మాట దాటేయటం కానీ.. నీళ్లు నమలటం కానీ చేస్తుంటారు.

ఎప్పుడూ లేనిది తలసాని విషయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం చాలా చిరిగ్గా ఉందట. తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి.. సమాచారహక్కు చట్టం ద్వారా.. తలసాని రాజీనామా వివరాల్ని తెలుసుకోవటం.. దాన్ని బయటపెట్టటం ద్వారా కేసీఆర్ సర్కారును ఇరుకున పడేయటం తెలిసిందే.

నిజానికి ఈ ఉదంతం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం ఉంది. తాజాగా దీనికి భిన్నమైన వెర్షన్ వినిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ తలసానిని మోసిన గులాబీ దళం.. ఇప్పుడు ఆయన్ను మోయలేమని చెప్పేస్తోంది. తలసాని వల్ల లాభం మాటేమో కానీ..నష్టం మాత్రం భారీగా ఉందని చెబుతున్నారు. అందుకే.. కాంగ్రెస్ నేతలకు ఇవ్వాల్సిన రీతిలో ‘‘సమాచారం’’ ఇచ్చేసి.. జరగాల్సింది జరిపించేశారని చెబుతున్నారు.

సమాచార హక్కు చట్టం ప్రకారం.. తలసానిని ఎలా బుక్ చేయాలో అన్న ఆలోచన మొత్తం గులాబీ దళానిదేనని.. ఇలాంటి ఐడియాలు వారివేనన్న వాదన వినిపిస్తోంది. సొంత మంత్రి మీద ఎందుకిలా చేస్తారంటే.. రాజకీయ వర్గాలు చెబుతున్న మాటేమిటంటే.. తలసాని మంత్రి పదవికి ఎసరు తేవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని.. అందుకే తమ చేతికి మట్టి అంటకుండా.. జరగాల్సిందేదో జరిగిపోయేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో.. కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన మంత్రి ఒకరు పని చేశారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి.. ఈ విషయంలో నిజానిజాలు ఎంతన్నది పక్కన పెడితే.. సొంతోళ్లే తలసానిని బుక్ చేశారన్న మాట మాత్రం జోరుగా వినిపిస్తోంది.