Begin typing your search above and press return to search.

మీరంతా ఉంటే ముఖ్యమంత్రి పదవి ఎందుకు తలసాని?

By:  Tupaki Desk   |   13 Oct 2019 10:31 AM GMT
మీరంతా ఉంటే ముఖ్యమంత్రి పదవి ఎందుకు తలసాని?
X
ప్రత్యర్థి పార్టీల మీద నోరు పారేసుకోవటానికి కొంతమంది నేతల అవసరం ఉంటుంది. అయితే..అలాంటి నేతల్ని ఉద్యమాల వేళ.. సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని పువ్వాడ అజయ్ లాంటోళ్లు రవాణా మంత్రిగా.. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను తప్ప పట్టే విషయంలో అప్పట్లో ఉద్యమం అంటే కస్సుమన్న తలసాని లాంటోళ్లను చుట్టూ పెట్టుకోవటానికి మించిన తప్పు పని మరొకటి ఉండదన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది అర్థం కాదు.

తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారటమే కాదు.. ఉద్యోగ సంఘాల వారిని.. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతి విషయానికి ముఖ్యమంత్రి కేసీఆరే పిలిచి మాట్లాడాలా? తామంతా మనుషులం కాదా? అంటూ తలసాని చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఈ రోజున తెలంగాణలో ఎలాంటి నిర్ణయం అయినా కేసీఆర్ కనుసన్నల్లో మాత్రమే జరుగుతుందన్న విషయం తలసాని లాంటి వారికి తెలీదా? పేరుకు మంత్రులే తప్పించి.. నిర్ణయాధికారం అన్నది ఏమీ లేదని.. ఆయా శాఖలకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా కేసీఆర్ మాత్రమే తీసుకుంటారే తప్పించి.. మంత్రులు కాదన్నది బహిరంగ రహస్యమే.

అన్నింటికి మించిన ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ మంత్రులకే దొరకని దుస్థితి ఉంది. అలాంటి వేళ.. తమకున్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని సంప్రదించాలని ఉద్యోగ సంఘాల వారు కోరుకోవటంలో తప్పు లేదు కదా? అయినా.. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు స్వతంత్య్రంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని తలసాని చెబితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తామంతా మనుషులం కాదా? అని ప్రశ్నిస్తున్న తలసాని.. మరి మంత్రులతో సరిపోయేదానికి ముఖ్యమంత్రి పదవి ఎందుకన్నది ప్రశ్న.

ఎన్నికల మేనిఫేస్టోలో ఆర్టీసీ అంశాన్ని తాము హామీ ఇవ్వలేదని.. అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఈ డిమాండ్ ఎందుకు తెర మీదకు తెస్తారంటూ.. తనకున్న తెలివి మొత్తాన్ని కుమ్మరించేసి మరీ ప్రశ్నిస్తున్న తలసాని.. సారు చెప్పిన హామీల్ని మాత్రమే కాదు.. ఇవ్వని హామీలకు సంబందించిన పథకాల్ని తెర మీదకు తెచ్చి అమలు చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆవేశంతో అధినేత మనసు దోచుకోవాలన్న ఆత్రుతతో మాట్లాడటం బాగానే ఉన్నా.. ఇలాంటివి ప్రజల్లో తనకున్న పలుకుబడిని దెబ్బ తీస్తాయన్న విషయాన్ని తలసాని ఎప్పటికి గుర్తిస్తారో?