Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ద‌మ్మున్న నాన్నంటే త‌ల‌సానే

By:  Tupaki Desk   |   31 March 2016 7:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ద‌మ్మున్న నాన్నంటే త‌ల‌సానే
X
ఏమాట‌కు ఆ మాటే నాన్నంటే మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వే. రెండు తెలుగురాష్ట్రాల్లో చాలామందే ప్ర‌ముఖులు ఉన్నారు. వారికి పుత్ర‌ర‌త్నాలున్నారు. కానీ.. త‌మ బిడ్డ‌లు త‌ప్పు చేస్తే రియాక్ట్ కావ‌టానికి ఒక‌టికి వంద‌సార్లు ఆలోచిస్తారు. క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆ త‌ర్వాత నోరు విప్పేందుకు సంశ‌యిస్తారు. కానీ.. తెలంగాణ మంత్రి త‌ల‌సాని అందుకు భిన్నం. త‌న కొడుకు మీద ఆరోప‌ణ వ‌చ్చిన గంట‌ల్లోనే త‌న ఇంట్లోనే ప్రెస్‌ మీట్ పెట్టేస్తారు. త‌న కొడుకు మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న తీవ్రంగా ఖండించ‌ట‌మే కాదు.. విష‌యం మొత్తం పూస గుచ్చిన‌ట్లుగా వివ‌రంగా చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తారు.

గ‌తంలో ఇలాంటివి ప‌లు సంద‌ర్భాల్లో చోటు చేసుకున్నా మీడియా ముందుకుపెద్ద‌గా వ‌చ్చేవి కావు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి అయ్యాక ఎవ‌రో వివ‌ర‌ణ అడిగే లోపు.. తానే మీడియా స‌మావేశం పెట్టేసి తేల్చేస్తే పోలా అన్న ధోర‌ణి క‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య ఒక అమ్మాయి ప్రైవేటు ఇష్యూలో త‌న కొడుకు పంచాయితీ చేశారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండించారు. చివ‌ర‌కు ఆ అమ్మాయిని తెర మీద‌కు తీసుకొచ్చి.. త‌ల‌సాని కొడుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌లేద‌ని.. తాము సాయం అడిగితేనే ఆయ‌న జోక్యం చేసుకున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

తాజాగా.. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత భ‌ర్త ఫైనాన్స్ ఇష్యూలో కిడ్నాప్‌.. బెదిరింపు లాంటి అంశాల మీద పెద్ద ఎత్తున వ‌చ్చిన ఆరోప‌ణ‌ల మీద తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన త‌ల‌సాని.. త‌న కొడుకు వార్నింగ్ లాంటివేమీ ఇవ్వ‌లేదని.. స్టార్ హోట‌ల్లో కూర్చొని మాట్లాడుకున్నారే త‌ప్పించి మ‌రిక ఏమీ లేద‌ని చెప్పుకొచ్చారు. త‌న కొడుకు అందుబాటులో లేర‌న్న ఆయ‌న‌.. ఆయ‌న్ను మాత్రం మీడియా ముందుకు తీసుకురాలేదు.

త‌న కొడుకు మీద వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఇష్యూ అంతా త‌న మీద వేసుకొని.. వివ‌ర‌ణ ఇవ్వ‌టం లాంటివి చూసిన‌ప్పుడు త‌ల‌సాని లాంటి నాన్న అస్స‌లు క‌న‌ప‌డ‌ర‌న్న మాట వినిపిస్తుంది. అయితే.. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా తాజా ప్రెస్‌ మీట్ లో త‌ల‌సాని ఒక మాట అన‌టం కాస్తంత ఆశ్చ‌ర్యంగా అనిపించ‌క మాన‌దు. మీడియా ప్ర‌తినిధి అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఏం చేస్తాం.. మ‌న ఖ‌ర్మ అనుకుందాం.. రోజూ ఇదో పంచాయితీ అయ్యింది.. బ‌ట్ట కాల్చ‌టం మీద వేయ‌టం అల‌వాటైంది. అరే దీ... 2011లో డ‌బ్బులు (రూ.11కోట్లు) తీసుకొని.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ్వ‌కుండా ఉండ‌టం.. అడిగే ఇదిగో ఇస్తా.. అదిగో ఇస్తానంటూ చెబుతూ.. ఇప్పుడేమో బెదిరించార‌న‌టం ఏమిటి? అంటూ కాసింత వేద‌న‌ను వ్య‌క్తం చేయ‌టం చూస్తే.. ఈ పంచాయితీల ఒత్తిడి త‌ల‌సాని మీద బాగానే ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.