Begin typing your search above and press return to search.

అత్తారింటికి దారేది సినిమా చూడ‌లేదా త‌ల‌సాని?

By:  Tupaki Desk   |   31 March 2016 6:02 AM GMT
అత్తారింటికి దారేది సినిమా చూడ‌లేదా త‌ల‌సాని?
X
అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత భ‌ర్త కిడ్నాప్ అంటూ మొద‌లైన క‌ల‌క‌లం తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బెదిరింపు వ‌ర‌కూ వ‌చ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో డ‌బ్బు పంచాయితీ ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నిన్న‌రాత్రి మొద‌లైన ఈ వ్య‌వ‌హారం.. తాజాగా మంత్రి త‌ల‌సాని త‌న ఇంట్లో ప్రెస్‌ మీట్ వ‌ర‌కూ చాలానే జ‌రిగిపోయాయి. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. మంత్రి మాట‌లు విన్న‌ప్పుడు కాస్తంత కామెడీగా అనిపించ‌టం ఖాయం. ఇవాల్టి రోజున అంద‌రికి అన్ని విష‌యాలు అర్థ‌మైపోతుంటే.. మంత్రిగారు మాత్రం చాలా అమాయ‌కంగా మాట్లాడ‌టం కాస్త ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు.

ఆయ‌న మాట్లాడిన మాటల్లో ఒక మాటేమిటంటే.. ఫైవ్‌ స్టార్ హోట‌ల్‌ లో బెదిరించ‌టం సాధ్య‌మేనా అని? తాజ్ కృష్ణ లాంటి హోట‌ల్లో కూర్చొని మాట్లాడుకునేట‌ప్పుడు ఎలా బెదిరిస్తారంటూ హోట‌ల్లోకి వెళ్లేట‌ప్పుడు.. వ‌చ్చేట‌ప్పుడు ఉన్న సీసీ కెమేరాల్ని చూస్తే వారెంత మామూలుగా వెళ్లారో అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. తిరిగి వెళ్లే స‌మ‌యంలో న‌వ్వుతూ ఉన్నార‌ని కూడా చెబుతున్నారంటూ త‌ల‌సాని కొడుకు త‌ర‌ఫున వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

త‌ల‌సాని ప్రెస్‌మీట్‌ను చూసిన‌ప్పుడు చ‌ప్పున అత్తారింటికి దారేది సినిమాలోని ఒక సీన్ క‌ళ్ల ముందు మెద‌ల‌క మాన‌దు. తాను తీసుకున్న అప్పును తీర్చే విష‌య‌మై ప‌వ‌న్ మేన‌త్త‌ను పేద్ద హోట‌ల్‌ కి పిలిపించి డీల్ మాట్లాడ‌టం.. ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌కుండానే ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చెప్పే మాట‌లతో.. ఆమె సంత‌కం పెట్టేసి.. వెళ్లిపోయే సీన్ చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంది.

ఇక్క‌డ చెప్పేదేమిటంటే.. త‌ల‌సాని కుమారుడు వార్నింగ్ ఇచ్చారో.. లేదో మ‌నం చూడ‌లేదు. కాబ‌ట్టి జ‌డ్జి చేయ‌లేం. దానికి సంబంధించిన ఆధారాలు లేన‌ప్పుడు.. ఒకరి మీద బ‌ట్ట కాల్చి మీద వేయ‌లేం. అలాంటి ప‌ని ఏమాత్రం మంచిది కాదు కూడా. కాక‌పోతే.. చెప్ప‌ద‌లుచుకున్న‌దేమంటే.. వార్నింగ్ ఇవ్వాలంటే స్టార్‌ హోట‌ల్లో ఇచ్చారా? అస‌లు ఇచ్చే అవ‌కాశం ఉంటుందా? లాంటి మంత్రిగారి మాట‌లే అభ్యంత‌ర‌క‌రం. బెదిరించాల‌ని అనుకునే వాళ్ల‌కి స్టార్ హోటల్ ఏమీ అడ్డం కాద‌న్న‌దే వాద‌న‌. ఎలా? అన్న డౌట్ వ‌స్తే.. అత్తారింటికి దారేది సినిమా సీన్ గుర్తుకు తెచ్చుకుంటే స‌రి. చూస్తుంటే.. మంత్రి త‌ల‌సాని అత్తారింటికి దారేది సినిమా చూడ‌లేదేమో?