Begin typing your search above and press return to search.

తప్పు పెట్టుకొని ఎదుటోళ్లను దులిపే మొనగాడే

By:  Tupaki Desk   |   21 July 2015 3:41 PM GMT
తప్పు పెట్టుకొని ఎదుటోళ్లను దులిపే మొనగాడే
X
ఏదైనా తప్పు చేసినప్పుడు.. జరిగింది తప్పని చెంపలేసుకొని క్షమాపణలు చెప్పటం.. విచారం వ్యక్తం చేయటం ఒకనాటి రాజకీయం. చేసిన తప్పును ఒక పట్టాన ఒప్పుకోకుండా.. ఎదుటోళ్ల తప్పుల్ని చూపిస్తూ.. మీరు చేసిన దాంతో పోలిస్తే.. మాదసలు తప్పేనా? అని ప్రశ్నించటం నయా రాజకీయం. అందుకు సరిగ్గా సరిపోయే నేత తలసాని శ్రీనివాస్ యాదవ్.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి.. తెలంగాణ అధికారపక్షంతో చెట్టాపట్టాలు వేసుకోవటమే కాదు.. మంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారని.. ఆ లేఖను స్పీకర్ కు పంపినట్లుగా పేర్కొన్నారు. తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర సహ చట్టం ద్వారా.. తలసాని రాజీనామా లేఖ అసెంబ్లీ కార్యాలయానికి చేరిందా? అని ప్రశ్నించటం.. అందుకు లేదన్న సమాధానం రావటంతో విపక్షాలు మరోసారి విరుచుకుపడటం తెలిసిందే.

తనపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో తలసాని గళం విప్పారు. తాను చేసింది తప్పా? ఒప్పా? అన్న విషయాన్ని అస్సలు ప్రస్తావించని ఆయన.. తనను తప్పు పడుతున్న వారందరిని తన మాటలతో ఉతికి ఆరేసే పని చేశారు.

తన గురించి మాట్లాడే వారి బండారం బయటపెడతానని ఒకింత బెదిరింపుతో మాట్లాడిన తలసాని.. భారత ప్రజాస్వామ్యంలో.. అసెంబ్లీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా తాను రియాక్ట్ అవుతున్నట్లు చెప్పిన ఆయన చాలానే విషయాలు చెప్పారు. నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన తనకు.. చాలా విషయాలు తెలుసని.. నిబంధనల గురించి అవగాహన ఉందని సమర్థించుకుంటూ..తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రం స్పీకర్ కు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నరిసింహుల్ని తెలుగుదేశం పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్ధతు ఇచ్చిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయటానికి ఎంతకాలం తీసుకున్నారో తనకు తెలుసన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఎస్పీవై రెడ్డి.. కొత్తపల్లి గీతలు తెలుగుదేశం పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించిన ఆయన.. దిలీప్.. కంతెటి సత్యనారాయణలు ఏ పార్టీకి చెందిన వారు? ఇప్పుడు బీజేపీలో ఎలా ఉన్నారంటూ.. తనపై విరుచుకుపడే అన్నీ పార్టీలపై హోల్ సేల్ గా విరుచుకుపడ్డారు. విమర్శించే అవకాశం వచ్చిన ప్రతిసారీ విడిచి పెట్టని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కడిగేశారు. దేశంలోని అన్నీ అసెంబ్లీలలో ఒకే చట్టం అమలైనప్పుడు.. తెలంగాణ వర్తించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ లో వర్తిస్తాయా? లేదా? అని అడిగేశారు. ఇన్ని ప్రశ్నలు అడిగిన తలసాని.. ఏపీలో పార్టీ ఫిరాయించిన నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న విషయాన్ని మాత్రం గుర్తు లేనట్లే వ్యవహరించారు.