Begin typing your search above and press return to search.

తలసాని రాజనామా యవ్వారం టెక్నికల్ అంట

By:  Tupaki Desk   |   20 July 2015 5:55 AM GMT
తలసాని రాజనామా యవ్వారం టెక్నికల్ అంట
X
కాసేపు కలకలం రేపిన తలసాని రాజీనామా వ్యవహారం.. ‘‘యవ్వారం’’గా మారిపోయింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తలసాని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని.. తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా పేర్కొనటం తెలిసిందే. అయితే.. రాజీనామా లేఖ వచ్చిందా? లేదా? అంటూ శాసన సభ కార్యాలయానికి తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా అని దరఖాస్తు పెట్టుకోవటం.. అందుకు ప్రతిగా తలసాని రాజీనామా లేఖ తమకు రాలేదంటూ శాసనసభ కార్యాలయం బదులు ఇవ్వటం జరిగింది.

ఈ నేపథ్యంలో తలసాని రాజీనామా వ్యవహారం అంతా నాటకమని.. అందరిని తప్పుదారి పట్టించారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. వీరికి.. తెలంగాణ తెలుగుదేశం నేతలు గళం కలిపారు. అయితే.. ఈ వ్యవహారం మొత్తాన్ని టీ కప్పులో తుఫానుగా శాసనసభా కార్యలయం అధికారులు తేల్చేశారు.

రాజీనామా లేఖ సాంకేతికంగా తమకు రాదని..స్పీకర్ కార్యాలయానికి వస్తుందని.. ఆ తర్వాత ఆ లేఖను స్పీకర్ ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయటం సహా మిగిలిన ప్రక్రియల కోసం శాసన సభ సచివాలయానికి లేఖ రాస్తుందని.. తాజా ఉదంతంలో శాసనసభ కార్యాలయానికి తలసాని రాజీనామా లేఖ వచ్చిందని మాత్రమే అడిగారని.. దానికి బదులుగా రాలేదని తాము చెప్పామని చెబుతున్నారు.

రాజీనామా లేఖ స్పీకర్ దగ్గర ఉందా? లేదా? అన్నది తమకు తెలీదని చెబుతున్నారు. రాజీనామా లేఖ స్పీకర్ దగ్గర ఉన్నదా? లేదా? అన్నది పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉండే అంశమని.. దానికి శాసనసభ కార్యాలయానికి ఎలాంటి సంబంధం ఉండదని తేల్చేస్తున్నారు. దీంతో.. తలసాని రాజీనామా చేశారని చెబుతున్న లేఖ అస్సలు పంపలేదనే వాదనలో ఏ మాత్రం బలం ఉండదని చెబుతున్నారు.

పూర్తిగా టెక్నికల్ అంశాన్ని టెక్నికల్ గా కాకుండా మామూలుగా డీల్ చేసి రచ్చ చేస్తే.. నష్టం విపక్షాలకే అన్న మాట వినిపిస్తోంది. గండ్ర మాటకు.. కౌంటర్ గా అసెంబ్లీ కార్యాలయం ఇస్తున్న సమాధానం లాజిక్ గా సరిపోవటమే దీనికి కారణం. బురద జల్లేటప్పుడు కాస్తంత వెనుకా.. ముందు చూసుకొని విపక్షాలు వేస్తే బాగుంటుందేమో. లేకపోతే.. కొండను తవ్వి ఎలుక కాదు కదా.. దాని ఆనవాళ్లు కూడా కనిపించకుంటే అంతకు మించిన ఎదురుదెబ్బ ఇంకేం ఉంటుంది..?