Begin typing your search above and press return to search.

తలసాని చేతులు జోడించి వేడుకున్న వేళ..

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:15 AM GMT
తలసాని చేతులు జోడించి వేడుకున్న వేళ..
X
విమర్శలు.. ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోని రాజకీయ నేతల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరిగా చెబుతారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు.. ఆరోపణలకు ధీటుగా స్పందిస్తారే కానీ.. డిఫెన్స్ లో పడ్డట్లు అస్సలు కనిపించరు. మాటకు మాట అన్నట్లుగా ధీటుగా స్పందించే అలాంటి నేతల్లో ఒకాయన.. అందుకు భిన్నమైన పరిస్థితుల్లో తాజాగా కనిపించారు. ఆయన ఎవరో కాదు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న టెన్నిస్ ప్లేయర్ భువనారెడ్డి అనే అమ్మాయిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు.. ఆమె భర్తను తీవ్రంగా గాయపర్చి.. తీసుకెళ్లారని.. తన ఇంట్లోనే బంధీగా ఉంచుకున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి స్పందించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడ్ని సీన్లోకి తీసుకురాని ఆయన.. ఈ వివాదానికి మూలమైన భువనారెడ్డి.. ఆమె తండ్రిని మీడియా ఎదుట హాజరు పరిచి తాను వారితో ఉండి.. తన కుటుంబంపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశారు. తమ కుటుంబాన్ని అనవసరంగా లాగారని.. 30 ఏళ్లు కష్టపడి తాను రాజకీయ నేతగా ఎదిగితే తనను దెబ్బ తీసేందుకు.. తన ప్రతిష్టను మసకబారేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఒక వ్యక్తి చేసిన ఆరోపణలతోనే తనపై నిందలు మోపితే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా తన మీద ఆరోపణలు చేస్తే.. కనీసం దానిపై తన వివరణ తీసుకోకుండా పతాక శీర్షికల్లో ఎలా ప్రచురిస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చేతులు జోడించి మరీ తన ఆవేదనను వ్యక్తం చేసిన మంత్రి తలసాని.. భువనారెడ్డికి సంబంధించిన ఇష్యూలో తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు. 30 ఏళ్లుగా తాను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను దెబ్బ తీసేలా వస్తున్న వార్తల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలు చేసే ఆరోపణల్ని తిప్పి కొట్టే విషయంలో కరుకుగా ఉండే ఆయన.. తాజా ఉదంతంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.

మరోవైపు.. భువనారెడ్డి వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన భర్త అబినవ్ తనను మానసిక వేధింపులకు గురి చేశాడని.. తన పుట్టింటికి పంపటానికి రూ.3 కోట్లు అడిగారని.. అతనికి తనను పెళ్లి చేసుకోవటానికి ముందే మరో పెళ్లి అయ్యిందని.. తనను ఇంటికి తీసుకెళ్లి.. ఇంట్లో ఉంచి తాళం వేసి ఆఫీసుకు వెళ్లేవాడని.. తన ముందే తన తండ్రిని విపరీతంగా కొట్టాడని.. ఇలా చాలానే ఆరోపణలు చేశారు భువనారెడ్డి. తాజాగా అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త అభినవ్ పై భార్య భువనారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు మాత్రం అలానే మిగిలిపోయాయి.

ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటే ఎవరి మీద ఆరోపణలు చేయకుండా మంత్రి తలసాని ఫ్యామిలీ మీదనే అభినవ్ ఎందుకు ఆరోపణలు చేసి.. ఫిర్యాదు చేసినట్లు? ఒకవేళ.. తన ముందే తన తండ్రిని కొట్టిన భర్తపై భువనారెడ్డి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అభినవ్ ఒంటి మీద కనిపించిన గాయాలన్నీ ఎట్లా వచ్చినట్లు? ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తలసాని కుమారుడు విలేకరుల సమావేశానికి ఎందుకు రానట్లు? తనపై వచ్చిన ఆరోపణల్ని ఎందుకు ఖండించుకోనట్లు?