Begin typing your search above and press return to search.

టీ పోల్స్ ఎఫెక్ట్‌!..ఏపీలో బాబుకు బొమ్మేన‌ట‌!

By:  Tupaki Desk   |   11 Dec 2018 11:00 AM GMT
టీ పోల్స్ ఎఫెక్ట్‌!..ఏపీలో బాబుకు బొమ్మేన‌ట‌!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు భ‌విష్య‌త్తును నిర్దేశించ‌నున్నాయ‌ని ఓ నెల‌ర్న‌ర‌గా అంత‌టా వినిపిస్తున్న మాటే. తెలంగాణలో త‌న‌తో మైత్రికి స‌సేమిరా అన‌డ‌మే టీఆర్ ఎస్ చేసిన పాపంగా ప‌రిగ‌ణించిన చంద్ర‌బాబు... టీఆర్ ఎస్ గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపారు. టీడీపీ ఆవిర్భావానికి ఏ పార్టీ అయితే కార‌ణ‌మైందో... అదే పార్టీ చంక‌న చేరిపోయిన చంద్ర‌బాబు... నిజంగానే తెలుగు జాతిని అవ‌మాన‌ప‌ర‌చిన కాంగ్రెస్ పార్టీ కాళ్ల ద‌గ్గ‌ర టీడీపీ మోక‌రిల్లేలా చేశారు. త‌న‌తో దోస్తీ చేయ‌ని ఏ ఒక్క‌రు - ఏ పార్టీ కూడా మ‌న‌జాల‌ద‌న్న రీతిలో త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు... నిజంగానే తెలంగాణ ప్ర‌జ‌ల్లో కసిని పెంచార‌నే చెప్పాలి. చంద్ర‌బాబు ర‌గిల్చిన ఆ క‌సితోనే తెలంగాణ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పార్టీకి చెందిన అభ్య‌ర్థుల‌తో పాటుగా చంద్ర‌బాబు పార్టీతో పొత్తు పెట్టుకున్న ఇత‌ర పార్టీల‌ను కూడా చీల్చి చెండాడేశారు. ఈ దెబ్బ‌కు బొటాబొటీ మెజారిటీతో మ‌రోమారు అధికారం చేప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావించిన టీఆర్ ఎస్‌.... గ‌తంలో కంటే కూడా బంప‌ర్ మెజారిటీ సాధించి... తెలంగాణ తిరుగులేని పార్టీగా అవ‌త‌రించింది. మొత్తంగా కేసీఆర్‌ ను గ‌ద్దె దించేందుకు చంద్ర‌బాబు ప‌న్నిన వ్యూహం బెడిసికొట్టడంతో పాటు తెలంగాణ ప్ర‌జ‌ల్లో అంతోఇంతో సానుకూలత క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీ ఓట‌ర్స్‌ కు బ‌ద్ధ శ‌త్రువుగా మారిపోయింది.

అంతేనా... ఈ ఫ‌లితాలు ఏపీలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాబుకు ప‌క్కాగా బొమ్మ కన‌బ‌డుతుంద‌ట‌. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ అధికారాన్ని కోల్పోవ‌డ‌మే కాకుండా... ఏకంగా ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కని పార్టీగా మిగిలిపోవ‌డం ఖాయ‌మేన‌ట‌. ఇదేదో... చంద్ర‌బాబు వ్య‌తిరేకులు చెబుతున్న మాట కాదు. మొన్న‌టిదాకా చంద్ర‌బాబు అడుగు జాడ‌ల్లో న‌డిచి, చంద్ర‌బాబు యూట‌ర్న్ భావాల‌తో విసిగిపోయి విధిలేని ప‌రిస్థితుల్లో టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ‌లో స‌త్తా చాటుతున్న నేత‌గా కొన‌సాగుతున్న టీఆర్ ఎస్ కీల‌క నేత‌ - మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ చెబుతున్న మాట ఇది. ఎన్నిక‌ల్లో భాగంగా స‌న‌త్ న‌గ‌ర్ నుంచి బ‌రిలోకి దిగిన త‌ల‌సాని... కూట‌మి అభ్య‌ర్థిని చిత్తుగా ఓడించి ఘ‌న విజ‌యం సాధించారు. మ‌రోమారు కేసీఆర్ కేబినెట్ లో కీల‌క మంత్రిగా మార‌బోతున్నారు. ఈ క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా త‌ల‌సాని... చంద్ర‌బాబు భ‌విష్య‌త్తును త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించారు. టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ఇత‌ర పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టి తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్ర‌బాబును... తెలంగాణ ప్ర‌జ‌లు భ‌రించే ప‌రిస్థితి లేద‌ని హెచ్చ‌రించారు. *నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌నా?* అన్న చందంగా బంగారు తెలంగాణ‌లో వేలు పెట్టి కెలికేందుకు య‌త్నించిన చంద్ర‌బాబుకు తెలంగాణ ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ధి చెప్పార‌ని త‌ల‌సాని త‌న‌దైన సెటైర్ విసిరారు.

అంత‌టితో ఆగ‌ని త‌ల‌సాని... తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు నోట వ‌చ్చిన కొన్ని డైలాగుల‌ను కూడా ప్ర‌స్తావించారు. తెలంగాణలో పార్టీలు మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల్సి ఉన్నా... అది జ‌ర‌గ‌లేద‌ని, అలాంటి వారిని ఓడించాల‌ని బాబు పిలుపిచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన త‌ల‌సాని... సిగ్గు లేకుండా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో వైసీపీ టికెట్ల‌పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన చంద్ర‌బాబు... ముందుగా వారితో రాజీనామాలు చేయించి తెలంగాణ గురించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. అయినా తెలంగాణ ప్ర‌చారంలో చంద్ర‌బాబు ప్ర‌స్తావించిన పార్టీ ఫిరాయింపులు, ఇంటికో ఉద్యోగం, మూడెక‌రాల పొలం త‌దిత‌రాల‌ను ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు కూడా గుర్తు చేశార‌ని హెచ్చ‌రించారు. అస‌లు ఏపీ ప్ర‌జ‌లకు 2014లో ఇచ్చిన హామీల‌ను ఏ మేర‌కు నెర‌వేర్చార‌ని కూడా ఆయ‌న చంద్ర‌బాబును నిల‌దీశారు. మొత్తంగా తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు... ఏపీలో చంద్ర‌బాబును గ‌ద్దె దింప‌డ‌మే కాకుండా... ఏకంగా శంక‌ర గిరి మాన్యాలు ప‌ట్టించ‌నున్నాయ‌ని త‌ల‌సాని చెప్పేశారు. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?