Begin typing your search above and press return to search.

మ‌హ‌ర్షి మీద త‌ల‌సాని పిటిష‌న్ బాంబేశారుగా!

By:  Tupaki Desk   |   8 May 2019 11:36 AM GMT
మ‌హ‌ర్షి మీద త‌ల‌సాని పిటిష‌న్ బాంబేశారుగా!
X
కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక పోయింద‌న్న సామెత‌కు త‌గ్గ‌ట్లుంది మ‌హ‌ర్షి నిర్మాత‌ల వ్య‌వ‌హారం. బుద్ధిగా ఐదో ఆట ఆడించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందిన వారు.. అత్యాశ‌తో టికెట్ల ధ‌ర‌ల పెంపుపై ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం.. టీ స‌ర్కారుకు ఆగ్ర‌హం క‌లిగించింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

సినిమా టికెట్ల రేట్ల‌ను పెంచే విష‌యంపై నిర్మాత అత్యుత్సాహంతో జ‌రిగిన ప్ర‌చారం.. తెలంగాణ ప్ర‌భుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ అయ్యేలా చేసింద‌న్న భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో కోర్టు ఇచ్చిన తీర్పును ప‌ట్టుకొని.. మాట వ‌ర‌స‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా తీసుకున్న నిర్ణ‌యంపై సినిమాటోగ్ర‌ఫీ శాఖ అగ్గిమీద గుగ్గిలం అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

టికెట్ల ధ‌ర‌ల పెంపున‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌న్న ప్ర‌చారం.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌ను ప్ర‌భుత్వ వ‌ర్గాలు వినిపిస్తున్నాయి. భారీగా థియేట‌ర్లలో సినిమాను రిలీజ్ చేస్తూ.. ఒక ఆట ఎక్కువ ఆడించేందుకు అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత క‌లెక్ష‌న్ల‌కు ఢోకా లేద‌ని.. అలాంట‌ప్పుడు టికెట్ల ధ‌ర‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న మాట ప్ర‌భుత్వ వ‌ర్గాలు వినిపిస్తున్నాయి.

టికెట్ల ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యం కార‌ణంగా ఆదాయం నిర్మాత‌ల‌కు.. ఆగ్ర‌హం ప్ర‌భుత్వం మీద‌కు వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎక్క‌డా అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యం ప్ర‌భుత్వం తీసుకోవాల్సి ఉంద‌ని.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై కోర్టులో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్లు చెప్పారు. సామాన్యులు కూడా సినిమా చూడాలంటే టికెట్ల రేట్లు త‌క్కువ‌గా ఉండాల‌న్న త‌ల‌సాని వ్యాఖ్య‌లు చూస్తే.. ప్ర‌భుత్వ ఆలోచ‌న ఏ తీరులో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని చెప్ప‌టం ద్వారా.. టికెట్ల ధ‌ర‌ల పెంపుపై తాము విముఖ‌త‌తో ఉన్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు చెబుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌భుత్వ‌మే టికెట్ల ధ‌ర‌ల పెంపుపై హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న నేప‌థ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తంగా చూస్తే.. మ‌హ‌ర్షి టికెట్ల ధ‌ర‌ల పెంపుపై మంత్రి త‌ల‌సాని వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.