Begin typing your search above and press return to search.

కొడుకు మీద వ్య‌తిరేక‌త ఎంతో చూశావా త‌ల‌సాని?

By:  Tupaki Desk   |   24 May 2019 6:43 AM GMT
కొడుకు మీద వ్య‌తిరేక‌త ఎంతో చూశావా త‌ల‌సాని?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు భేటీ అయ్యే అవ‌కాశం.. అదృష్టం ఉన్న అతి కొద్దిమంది నేత‌ల్లో త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఒక‌రుగా చెబుతుంటారు. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. త‌ల‌సానికి ఆయ‌న ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తార‌ని చెప్పాలి. మ‌రెవ్వ‌రికి లేని విధంగా టీడీపీ నుంచి త‌న పార్టీలో చేరిన గంట‌ల్లోనే మంత్రి ప‌ద‌విని అప్ప‌గించిన నేత ఒక్క త‌ల‌సాని మాత్ర‌మే.

అంతేనా.. రెండో సారి విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. తోపుల్లాంటి నేత‌ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేసిన కేసీఆర్‌.. త‌ల‌సానికి మాత్రం మంత్రి ప‌ద‌విని కంటిన్యూ చేయ‌టం మామూలు విష‌యం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌ల‌సాని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్ప‌టం కూడా త‌ల‌సాని మీద ఉన్న అభిమాన‌మే అని చెబుతారు.

బీసీ నేత‌గా ఆయ‌న‌కున్న ఛ‌రిష్మాతోపాటు.. ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డితో పాటు అంగ‌బ‌లం.. అర్థ‌బ‌లం త‌ల‌సాని సొంత‌మ‌ని న‌మ్మే ఆయ‌న‌.. సికింద్రాబాద్ సీటును ఆయ‌న కుమారుడికి ఇచ్చేందుకు ఓకే చేశారు.

అయితే.. తాజాగా వెలువ‌డిన ఫ‌లితం షాకింగ్ గా మారింది. పూర్తి ఏక‌ప‌క్షంగా సాగిన‌ట్లుగా ఎన్నిక‌ల ఫ‌లితాన్ని చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. నిజానికి ఎంపీగా పోటీ చేసిన స‌మ‌యంలో కిష‌న్ రెడ్డికి ఉన్న వ‌న‌రులు ప‌రిమితంగా ఉండ‌టంతో ఆయ‌న ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. త‌ల‌సానితో ఢీ కొట్టేంత లేక‌పోయిన‌ప్ప‌టికీ.. అండ‌ర్ గ్రౌండ్ వ‌ర్క్ పుణ్య‌మా అని గెలిచే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

తాజా ఎన్నిక‌ల ఫ‌లితాన్ని లోతుగా చూస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్‌.. మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోలిస్తే.. నోటా ఓటు అత్య‌ధికంగా సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో న‌మోదు కావ‌టం ఆస‌క్తిక‌ర అంశం. సికింద్రాబాద్ లో నోటాకు 5,592 ఓట్లు వ‌చ్చాయి. మ‌రే నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇంత భారీగా ఓట్లు పోల్ కాలేద‌ని చెబుతున్నారు.

నోటాకు ఇంత భారీగా పోల్ అయిన ఓట్లు.. టీఆర్ఎస్ కు చెందిన‌వ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల‌సాని కుమారుడు క‌మ్ అభ్య‌ర్థి అయిన సాయికిర‌ణ్ అభ్య‌ర్థిత్వాన్ని న‌చ్చ‌ని వారు.. అటు బీజేపీకి వేయ‌లేక‌.. కాంగ్రెస్ కు వేయ‌లేక నోటాకు వేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

సాయి కిర‌ణ్ కాకుండా మ‌రెవ‌రైనా టీఆర్ ఎస్ ప‌రాజ‌యం ఇంత దారుణంగా ఉండేది కాదంటున్నారు. ఎన్నిక‌ల వేళ‌లో సాయి కిర‌ణ్ మీద ఉన్న కేసులు.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇది కూడా తుది ఫ‌లితం మీద ప్ర‌భావాన్ని చూపిన‌ట్లుగా భావిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియాలో త‌న కొడుకు మీద విడుద‌ల అవుతున్న వీడియోల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌ల‌సాని.. తాజాగా వెలువ‌డిన ఫ‌లితం చూసి.. కొడుకు మీద ప్ర‌జ‌ల్లో ఇంత వ్య‌తిరేక‌త ఉందా? అని ఆశ్చ‌ర్య‌పోయినట్లుగా తెలుస్తోంది.