Begin typing your search above and press return to search.

మ‌రో వార‌సుడు!...ఈ సారి తెలంగాణ‌లో!

By:  Tupaki Desk   |   13 Feb 2019 2:43 PM GMT
మ‌రో వార‌సుడు!...ఈ సారి తెలంగాణ‌లో!
X
ప్ర‌స్తుతం వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు సంబంధించి ఏపీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంత‌మంది సీనియ‌ర్లు త‌మ వార‌సుల‌ను దింపుతార‌నే విష‌యంపై ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌త ఉన్నా... చివ‌ర‌కు ఎంత‌మందికి అవ‌కాశం చిక్కుతుంద‌న్న విష‌యం మ‌రో నెల‌లో తేలిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఏపీ వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి అయితే... ఇప్పుడు తెలంగాణ‌లోనూ మ‌రో రాజ‌కీయ వార‌సుడు ఎంట్రీ ఇస్తున్న‌ట్లుగా వినిపిస్తున్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వార‌సుడు ఎవ‌న్న విష‌యానికి వ‌స్తే.. మొన్న‌టిదాకా టీడీపీలో త‌న‌దైన హ‌వా కొన‌సాగించి - ఇప్పుడు టీఆర్ ఎస్ లో కూడా త‌నదైన శైలిలో స‌త్తా చాటుతున్న త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌... ఇప్పుడు త‌న వార‌సుడిని రంగంలోకి దించుతున్నాడ‌ట‌. అయినా తెలంగాణ‌లో ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి క‌దా అంటారా? అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిస్తే... పార్ల‌మెంటు ఎన్నిక‌లు లేవా? ఉన్నాయి క‌దా.

మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశంలోని అన్ని పార్ల‌మెంటు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని లోక్ స‌భ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందే క‌దా. ఇదే అంశాన్ని ఆస‌రా చేసుకుని త‌ల‌సాని చాలా తెలివిగా పావులు క‌దుపుతున్నార‌ట‌. త‌ల‌సాని కుమారుడు త‌లసాని సాయికిర‌ణ్ యాద‌వ్ గుర్తున్నారా? మొన్నామ‌ధ్య అర‌కు ఎంపీ కొత్తప‌ల్లి గీత‌కు సంబంధించిన భూవివాదంలో సాయికిర‌ణ్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా కొత్త‌ప‌ల్లి గీతకు సంబంధించిన భూమిని సాయి కిర‌ణ్ బ‌ల‌వంతంగా లాగేసుకున్నార‌ని, ఇదేంట‌ని అడిగితే బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత సాయి కిర‌ణ్ పేరు కూడా వినిపించ‌లేదు. అయితే ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌న‌త్ న‌గ‌ర్ స్థానం నుంచి బ‌రిలోకి దిగిన త‌న తండ్రి త‌ర‌ఫున సాయి కిర‌ణ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఆస్ట్రేలియాలో ఉన్న‌త విద్యాభ్యాసం ముగించిన త‌ర్వాత సాయి కిర‌ణ్ రాజ‌కీయాల్లోకి దిగేశారు. ఇప్పుడు ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దింపేందుకు త‌ల‌సాని చాలా వ్యూహాత్మ‌కంగా పావులు కదుపుతున్నార‌ట‌. సికింద్రాబాద్ ప‌రిస‌రాల్లో మంచి ప‌ట్టున్న త‌ల‌సాని.. త‌న కుమారుడిని సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దించేందుకు పావులు క‌దుపుతున్నార‌ట‌. ఈ స్థానం నుంచి టికెట్ ను ఆశిస్తున్న నేత‌లు టీఆర్ఎస్‌లో పెద్ద‌గా లేరనే చెప్పాలి. ఇదే అవ‌కాశంగా తీసుకున్న త‌ల‌సాని వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న‌ట్లుగా వినికిడి. పార్టీలో త‌న మాట‌కు మంచి విలువ ఉన్న నేప‌థ్యంలో త‌న కుమారుడికి టికెట్ ఇచ్చే విష‌యంలోనూ కేసీఆర్ పెద్ద‌గా ఆలోచించ‌రన్న‌ది త‌ల‌సాని భావ‌న‌గా తెలుస్తోంది. త‌ల‌సాని అనుకున్న‌ట్లుగా అన్నీ జ‌రిగితే.. సికింద్రాబాద్ నుంచి త‌ల‌సాని జూనియ‌ర్ ఎంపీగా బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో గెలిచే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.