Begin typing your search above and press return to search.

డిగ్గీపై ప‌రువున‌ష్టం వేస్తానంటున్న త‌ల‌సాని

By:  Tupaki Desk   |   2 Jun 2017 2:28 PM GMT
డిగ్గీపై ప‌రువున‌ష్టం వేస్తానంటున్న త‌ల‌సాని
X
గ‌డిచిన మూడేళ్ల‌లో టీఆర్ ఎస్ స‌ర్కారుకు ఎదురుకాని కొత్త అనుభ‌వం ఎదురైంది. ఎప్పుడూ లేని విధంగా అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌ట‌మే కాదు.. కుంభ‌కోణాల్లోనూ పాత్ర ఉంద‌న్న వాద‌న బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌న ప్ర‌భుత్వం మీద ఒక్క అవినీతి మ‌ర‌కా లేదంటూ ద‌మ్ముగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మాట‌ల్ని స‌వాల్ చేసేలా కాంగ్రెస్ నేత‌ల మాట‌లు ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో పాటు.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి బాగా స‌న్నిహితంగా ఉండే డిగ్గీ రాజా మొద‌లు.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు కేసీఆర్ స‌ర్కారు మీదా.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల మీదా అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఊహించ‌ని విధంగా త‌మ‌పై ప‌డిన అవినీతి ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తూ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌రావు రియాక్ట్ అయ్యారు.

కాంగ్రెస్ నేత‌లు ఆరోపించిన‌ట్లుగా మియాపూర్ భూ కుంభ‌కోణంలో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న ఆయ‌న‌.. త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్‌ పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు చెప్పిన త‌ల‌సాని డిగ్గీరాజాపై సికింద్రాబాద్ మ‌హంకాళి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

డిగ్గీ రాజాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలిపెట్ట‌న‌ని చెప్పిన త‌ల‌సాని.. కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాల‌న అని.. అలాంటి వారు కుటుంబ పాల‌న గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. ఒక్క మీటింగ్ కే కాంగ్రెస్ నేత‌లు భుజాలు ఎగ‌రేయ‌టంపై ఎద్దేవా చేసిన త‌ల‌సాని.. కాంగ్రెస్ నేత‌ల్ని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌టం లేద‌న్నారు. మొత్తానికి అధికార‌ప‌క్షానికి.. తెలంగాణ కాంగ్రెస్‌ కు మ‌ధ్య మొద‌లైన ఈ మాట‌ల యుద్ధం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/