Begin typing your search above and press return to search.

స‌రికొత్త సంచ‌ల‌నం: త‌ల‌సాని వ‌ర్సెస్ ద‌త్తాత్రేయ‌!

By:  Tupaki Desk   |   2 Oct 2018 4:59 AM GMT
స‌రికొత్త సంచ‌ల‌నం: త‌ల‌సాని వ‌ర్సెస్ ద‌త్తాత్రేయ‌!
X
టీఆర్ఎస్.. బీజేపీల మ‌ధ్య ఏదో లింకు ఉందంటూ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప్ర‌చారానికి భిన్నమైన విష‌యం ఒక‌టి రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తాజాగా ర‌ద్దు అయిన అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఐదు స్థానాల్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చేలా చేస్తే.. లోగుట్టుగా గులాబీ అభ్య‌ర్థుల‌కు క‌మ‌ల‌నాథుల అభ‌యం ఉంటుంద‌న్న వాద‌న వినిపించింది. ఇందులో నిజం ఎంత‌న్న దానిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. కేసీఆర్ అనౌన్స్ చేసిన 105 మంది అభ్య‌ర్థుల్లో ఒక్క స్థాన‌మే బీజేపీకి చెందింది ఉండ‌టం.. ఉన్న ఒక్క స్థానంలో బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించిన‌ట్లుగా ప్ర‌చారం సాగింది. అంతేకాదు.. బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీజేపీ గెలిచేందుకు వీలుగా బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపుతామ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ వాద‌న‌కు పూర్తి విరుద్ద‌మైన సీన్ ఒక‌టి త్వ‌ర‌లో తెర‌పైకి రానుంద‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పై పోటీకి సికింద్రాబాద్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న బండారు ద‌త్తాత్రేయ‌ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మాజీ కేంద్ర‌మంత్రి హోదాలో ఉన్న దత్త‌న్న‌.. పార్టీ ఆదేశాల‌కు త‌గ్గ‌ట్లే స‌న‌త్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగేందుకు ఆయ‌న ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. 2014లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన త‌ల‌సాని.. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల‌కే అధికార టీఆర్ ఎస్‌ లోకి చేర‌టం తెలిసిందే.

ఉలాబీ కారు ఎక్కిన త‌ల‌సానికి మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. త‌ల‌సానిపై బ‌ల‌మైన అభ్య‌ర్థిగా బీజేపీ ముఖ్య‌నేత‌లు బండారు ద‌త్తాత్రేయ పేరును తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వ‌ర్గంతో పాటు.. ద‌త్త‌న్న సామాజిక వ‌ర్గ‌మైన కురుమ‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

స‌న‌త్ న‌గ‌ర్‌లో ఉన్న ప‌రిస్థితుల్ని చూస్తే..తీర్పు బండారుకు సానుకూలంగా ఉన్న‌ట్లుగా బీజేపీ వ‌ర్గాలు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న ఆయ‌న అసెంబ్లీ బ‌రిలోకి దిగ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తున్నా.. అదేమీ త‌ప్పు కాద‌న్న మాట‌ను పార్టీ వ‌ర్గాలు తేల్చేస్తున్నారు. ఎంపీగా ద‌త్త‌న్న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సికింద్రాబాద్ లోక్ స‌భ ప‌రిధిలోనే స‌న‌త్ న‌గ‌ర్ ఉంద‌ని.. ద‌త్త‌న్న బ‌రిలోకి దిగితే త‌ల‌సానికి చెక్ పెట్టిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. అసెంబ్లీ బ‌రిలోకి దిగేందుకు బండారు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. తాజా మాజీ మంత్రి త‌ల‌సానికి భారీ ఎదురుదెబ్బ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ప్ర‌చారంతో త‌ల‌సాని వ‌ర్గం గంద‌ర‌గోళానికి గురి అవుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.