Begin typing your search above and press return to search.

బాబు మంత్రులు అలా అనుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   8 Jun 2015 4:10 PM GMT
బాబు మంత్రులు అలా అనుకుంటున్నారా?
X
అవకాశం వచ్చిన ప్రతిసారీ నోటికి వచ్చినట్లు మాట్లాడే నేతల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఒకరు. కాకపోతే.. ఆయన మాటల్లో ఉండే మేజిక్‌ ఏమిటంటే..కాస్తంత పరుషంగా.. అందరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఆయన చేసేది అడ్డగోలు వాదన అన్న భావన కలిగినప్పటికీ.. వాటిని వినాలనిపించేంత స్పైసీగా ఉంటాయి.

చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేని ఆయన గురించి చూస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ విడుదల చేసిన అధికారిక గెజిట్‌లో ఉంది. మరి.. టీడీపీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఎలా వ్యవహరిస్తున్నారు? ఇదేం విచిత్రం? నిబంధనల ప్రకారం ఇదెలా సాధ్యం ? లాంటి ప్రశ్నల్ని అస్సలు అడగకూడదు. ఒకవేళ అడిగినా సమాధానం చెప్పేవాళ్లు కనిపించరు.

ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి.. ఆ పార్టీ నుంచి పూర్తిగా బయటకు రాకుండానే మంత్రి పదవిని చేపట్టే తలసాని మాట్లాడే మాటల్ని చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలుకు వెళతారా? అని ఏపీ మంత్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏసీబీ వ్యవహారంలో తెలంగాణ న్రపభుత్వం జోక్యం చేసుకోదని ఆయన వ్యాఖ్యానించారు.

తమ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాలని ఏపీ మంత్రులు ఒక్కరైనా అనుకుంటారా? లాంటి ప్రశ్నకు సామాన్యుడు సైతం సమాధానం చెబుతారు. ఇక..ఏసీబీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోదన్న మాటనే చూస్తే.. నిజంగా అదే నిజమైతే.. ఏసీబీ దగ్గర ఉండాల్సిన రేవంత్‌ వీడియో క్లిప్పింగ్‌లు అనధికారికంగా టీవీ చానళ్ల వద్దకు ఎలా వచ్చాయి? అంతేకాదు.. చంద్రబాబు మాట్లాడుతున్నారని చెబుతున్న ఆడియో సీడీలు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన టీ న్యూస్‌ ఛానల్‌కు ఎలా వచ్చాయి? వీటికి తలసాని ఏం బదులిస్తారు..?