Begin typing your search above and press return to search.

తాలిబన్ల అరాచకం...జర్నలిస్టుల బట్టలు విప్పి మరీ..ఎందుకంటే

By:  Tupaki Desk   |   9 Sep 2021 8:56 AM GMT
తాలిబన్ల అరాచకం...జర్నలిస్టుల బట్టలు విప్పి మరీ..ఎందుకంటే
X
ఆఫ్ఘానిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల పాలన ప్రారంభమైంది. అమెరికా వెనక్కి వెళ్లిపోవడం తో మళ్లీ ఆఫ్ఘన్ పై తాలిబన్లు పట్టు సాధించారు. దీనితో తాలిబన్లు అక్కడ షరియా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయితే , గతంలో కఠినమైన నియమాలు ఉండవు అని చెప్తూనే , మరోవైపు తాలిబన్ల రెచ్చిపోతున్నారు. తాలిబన్ల చేష్టలకి ఆఫ్ఘన్ వాసులు గజగజవణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఆందోళన పెరిగిపోతుంది. ప్రజలను హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా నిరసన ప్రదర్శనలను ప్రసారం చేసిన జర్నలిస్టులపై తాలిబన్లు కనికరం అనేది లేకుండా దాడి చేశారు.

ఇద్దరు జర్నలిస్టులను బంధించి తీవ్రహింసకు గురిచేశారు. బట్టలు విప్పి రక్తం వచ్చేలా కొట్టారు. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను ఎందుకు కవర్ చేశారంటూ కొన్ని గంటలపాటు చిత్రహింసలకు గురిచేశారు. అయితే, తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనితో పలువురు ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ తాలిబన్ల అరాచకాల పై మండిపడుతున్నారు. ఆఫ్ఘాన్‌ ను తాలిబన్లు కైవసం చేసుకున్న నాటినుంచి వారికి వ్యతిరకేంగా మహిళలు భారీ నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. వారిపై తాలిబన్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా, మహిళలు వెనక్కి తగ్గడంలేదు. రోడ్లపైకి చేరి తాలిబన్ల నుంచి స్వేచ్ఛ కావాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు.

ఈ క్రమంలో పశ్చిమ కాబుల్‌ లోని కర్తే ఛార్‌ ప్రాంతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు దీన్ని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులకు పాల్పడ్డారు. ఆఫ్గాన్‌ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్‌ కు చెందిన వీడియో ఎడిటర్‌ తాఖీ దర్యాబీ, రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి బంధించి,, చిత్రహింసలకు గురిచేశారు. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించి చావబాదినట్లు మీడియా సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. తీవ్రమైన గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలను ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా విడుదల చేయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ఫొటోలు వైరల్‌ అయిన అనంతరం.. కొన్ని మీడియా సంస్థలు తాలిబన్ల అరాచకాలపై ఆగ్రహం వ్యక్తంచేశాయి.