Begin typing your search above and press return to search.

కశ్మీర్‌‌ ను పాక్‌ లో కలిపేందుకు తాలిబన్ల సాయం చేస్తారట !

By:  Tupaki Desk   |   25 Aug 2021 10:00 AM IST
కశ్మీర్‌‌ ను పాక్‌ లో కలిపేందుకు తాలిబన్ల సాయం చేస్తారట !
X
ఆఫ్ఘనిస్థాన్‌ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్గనిస్తాన్ నుండి అమెరికా బలగాలు వెనక్కి తగ్గిన తర్వాత, అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. తాలిబన్లు అనుకున్న సమయం కంటే చాలా తక్కువ సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఇకపై ఆఫ్ఘనిస్తాన్ లో పలు కీలక మార్పులు జరగబోతున్నాయి. అబ్బాయిలు , అమ్మాయిలు కలిసి చదువుకోవడం ఇకపై కనిపించదు. కో ఎడ్యుకేషన్ కి తాలిబన్లు ఒప్పుకోలేదు. దీనితో పాటుగా మహిళలపై అనేక రకమైన షరతులు విధిస్తున్నారు.

ఇదిలా ఉంటే .. ఆఫ్ఘనిస్థాన్‌ ను తాలిబన్లు ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిందంటూ పాకిస్థాన్, ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌ పై ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ కు చెందిన ఒక నేత ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా మాట్లాడారు. ఒక లైవ్ షోలో మాట్లాడిన పాక్ అధికార పార్టీ పాకిస్థాన్ టెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో మనకు సాయం చేసేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నారు అని ఆమె అన్నారు. ఈ మాటలు విన్న యాంకర్ ఆశ్చర్యపోయారు. మేడమ్, మీరేమంటున్నారో మీకన్నా అర్థమవుతోందా, మీకర్థం కావడంలేదు. ఈ షో ప్రపంచం మొత్తం ప్రసారమవుతుంది. ఇండియాలో కూడా ఇది చూస్తారు అని యాంకర్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే యాంకర్ మాటలను పట్టించుకోని పీటీఐ నేత.. తాలిబన్లు అవమానకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నారని, అందుకే తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు. కాగా, ఆఫ్ఘన్ పగ్గాలు అందుకున్న అనంతరం తాలిబన్లు పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో కశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడిన తాలిబన్లు. అది భారత్ అంతర్గత, ద్వైపాక్షిక సమస్య అని స్పష్టంచేశారు. దానిలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు. కానీ ఇప్పుడు నీలం చేసిన వ్యాఖ్యలతో తాలిబన్ల ప్రకటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అఫ్గాన్‌పై ఆధిపత్యం సాధించేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్మీ సహకరించిందని గతంలో అఫ్గాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ఇర్షాద్ కామెంట్స్ బలం చేకూర్చేలా ఉన్నాయి.