Begin typing your search above and press return to search.

ఆరాచ‌కం: ఆప్ఘ‌న్ పార్ల‌మెంటులోనే బాంబులు పేల్చారు

By:  Tupaki Desk   |   22 Jun 2015 9:52 AM GMT
ఆరాచ‌కం: ఆప్ఘ‌న్ పార్ల‌మెంటులోనే బాంబులు పేల్చారు
X
అరాచ‌కం అంటే ఆప్ఘ‌నిస్తాన్‌లోనే చూడాలి. ఉగ్ర‌వాదులు ఎక్క‌డిక‌క్క‌డ తెగ‌బ‌డుతూ.. మ‌నుషుల్ని అత్యంత దారుణంగా చంపేస్తూ రాక్ష‌సానందం పొందుతుంటారు. తాలిబ‌న్ల దారుణ చ‌ర్య‌లు మ‌రింత పెట్రేగిపోయాయి. తాజాగా ఆప్ఘ‌న్ పార్ల‌మెంటులోనే బాంబులు పేల్చిన ప‌రిస్థితి.
విస్మ‌య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆప్ఘ‌నిస్తాన్ పార్ల‌మెంటులో నూత‌న ర‌క్ష‌ణ మంత్రిని స‌భ‌కు ప‌రిచ‌యం చేసే స‌మ‌యంలోనే బాంబులు పేల‌టంతో స‌భ‌లోని నేత‌లంతా ఒక్క‌సారి ఉలిక్కిప‌డ్డారు. వ‌రుస‌గా పెద్ద శ‌బ్దంతో వ‌రుస‌గా బాంబులు పేల‌టంతో.. ద‌ట్టమైన పొగ వ్యాపించ‌టంతో ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి.

బాంబుల శ‌బ్ధంతో ఉలిక్కిప‌డిన ఎంపీలు భ‌యంతో ప‌రుగులు పెట్టారు. వారు సుర‌క్షితంగా ఉండ‌టం కోసం బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్ట‌టం శాపంగా మారింది. ఎందుకంటే పార్ల‌మెంటు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎంపీల్ని పార్ల‌మెంటు ప్రాంగణంలో ఉన్న ఆత్మాహుతి ద‌ళాలు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జ‌రిపారు.
దీంతో.. పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని భావిస్తున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. ప్రాధ‌మిక స‌మాచారం ప్ర‌కారం తాలిబ‌న్ల దాడిలో దాదాపు ఆరుగురు చ‌నిపోయిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఘ‌ట‌న తీవ్ర‌తను ప‌రిశీలిస్తే.. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని చెప్పొచ్చు.

పార్ల‌మెంటుపై దాడి చేసింది తామేన‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించుకున్నారు. ఆత్మాహుతి ద‌ళాలు జ‌రుపుతున్న కాల్పుల షాక్ నుంచి తేరుకున్న భ‌ద్ర‌తా ద‌ళాలు ఇప్పుడు వారిని తుద‌ముట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పెద్ద ఎత్తున వాహ‌నాలు దెబ్బ తిన్న‌ట్లు చెబుతున్నారు. పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించిన ఆత్మాహుతి ద‌ళాల్ని ఏరివేసేందుకు ర‌క్ష‌ణ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉగ్ర‌వాదుల కాల్పులు కొన‌సాగుతున్నాయి. వారిని నియంత్రించేందుకు ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ బ‌ల‌గాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి.