Begin typing your search above and press return to search.

తాలిబన్ల అకృత్యాలు ... 'పదేళ్లు అబ్బాయిలా ఎన్నో కష్టాలు '

By:  Tupaki Desk   |   27 Aug 2021 10:30 AM GMT
తాలిబన్ల అకృత్యాలు ... పదేళ్లు అబ్బాయిలా ఎన్నో కష్టాలు
X
అఫ్గనిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల వశం అయ్యింది. తాలిబన్ల అరాచక పాలనను తలుచుకుని జనాలు భయంతో వణికిపోతున్నారు. వారి రాక్షస పాలనలో మేం బతకలేం అంటూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గన్‌ మహిళల మనోవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాలిబన్ల దృష్టిలో స్త్రీ అంటే కేవలం శృంగారానికి పనికివచ్చే ఓ వస్తువు. వారికంటూ ఎలాంటి ఆలోచనలు, ఆశయాలు ఉండకూడదు. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ వీలైనంత త్వరగా కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్‌ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌ లో నివసిస్తోన్న అఫ్గాన్‌ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్‌.

ప్రస్తుతం నదియా అఫ్గాన్‌ లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ దేశాన్ని, ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు. గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు అని వణికిపోతోంది. ఆమె భయానికి కారణం ఏంటో తెలుసా ఆమె అనుభవించిన నరకయాతనే.

గతంలో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ ను పరిపాలిస్తున్న సమయంలో నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. అయితే , ఆ సమయంలో షరియా చట్టం అమలులో ఉండటంతో, అదే సమయంలో మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు అని తాలిబన్లు హుకుం జారీ చేశారు.

అన్నయ్య చనిపోయాడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇంట్లో తినడానికి కూడా ఉండదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా మారింది. బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. దాదాపు 10 ఏళ్ల పాటు పురుషుడిగా మారువేషం వేసుకుని తిరిగింది. ఈ క్రమంలో ఓసారి జరిగిన పేలుళ్లలో నదియా తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఓ ఎన్‌ జీఓ నదియాను చేరదీసి, చికిత్స చేసింది. ఈరోజు ఆమె జీవించి ఉండటానికి కారణం ఆ ఎన్‌ జీవో అంటుంది నదియా. ఆ ఎన్‌ జీవో సాయంతో నదియా అఫ్గన్‌ విడిచి వెళ్లింది. కానీ ఆమె కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది.

స్పెయిన్‌ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం పాంట్స్‌ పర్‌ లా పావ్‌ ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. ఇక నజియా రాసిన నవలకు 2010 ప్రతిష్టాత్మక ప్రుడెన్సీ బెర్ట్రానా ను గెలుచుకోవడమే కాక జాతీయ విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రస్తుతం మల్లి తాలిబన్లు ఆఫ్ఘన్ లోకి ప్రవేశించడం తో తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను విడిచిపెట్టలేదని నదియా చాలా కాలం నుంచి హెచ్చిరిస్తూనే ఉన్నారు. అంతేకాక అమెరికా శాంతి అనే అబద్ధం చిత్రాన్ని విక్రయించింది అన్నారు నదియా. అంతేకక అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర అంతర్జాతీయ శక్తుల వైఖరి అఫ్గనిస్తాన్‌కు "ద్రోహం కంటే ఎక్కువ కీడు" చేశాయని నదియా ఆరోపించారు.