Begin typing your search above and press return to search.

వెన్నుపోటుతోనే ప్రభుత్వం పతనమైందా ?

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:36 AM GMT
వెన్నుపోటుతోనే ప్రభుత్వం పతనమైందా ?
X
వెన్నుపోటు వల్లే ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిందా ? అవుననే అంటున్నాయి తాజా విశ్లేషణలు. దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ వెన్నెంటే ఉంటూ చివరకు పొడిచిన వెన్నుపోటు వల్లే దేశం మొత్తం అంత తొందరగా తాలిబన్ల వశమైపోయిందట. దేశం నుండి అమెరికా, నాటో దళాలు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఎప్పుడోప్పుడు దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటాయన్న విషయాన్ని ప్రపంచ దేశాలు ఊహించిందే.

అయితే అమెరికా దళాలు ఇంకా దేశంలో ఉండగానే తాలిబన్లు ఇంతవేగంగా దేశాన్ని ఆక్రమించుకోటంతో ప్రపంచం షాక్ కు గురైంది. దీనికి కారణాలను అన్వేషిస్తున్న అగ్రరాజ్యానికి అసలు కారణం ఇపుడు తెలిసిందట. ఇంతకీ ఆ కారణం ఏమిటయ్యా అంటే మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి సన్నిహితుడైన మిర్వాయిస్ యాసిని వెన్నుపోటు పొడిచినట్లు ఇపుడు బయటపడింది. యాసిని మాజీ అధ్యక్షుడు ఘనీకి పక్కనే ఉంటూ తాలిబన్లకు బద్ద వ్యతిరేకిగా ప్రకటనలిస్తునే, ఘనీని తప్పుదోవ పట్టించి లోలోపల వాళ్ళకి పూర్తిగా సహకరించారట.

అంతర్గతంగా యాసిని తాలిబన్లతో చేతులు కలిపిన కారణంగా ఇప్పుడు ఆయనకే తాలిబన్లు కాబూల్ పాలన బాధ్యతలను అప్పగించారట. నిజంగానే యాసిని తాలిబన్లకు బద్దవిరోధి అయితే ఆయన కూడా మాజీ అధ్యక్షుడు ఘనీ లాగే దేశం విడిచిపారిపోవాలి. లేకపోతే ఉపాధ్యక్షుడు సలేహ్ లాగ కనీసం పంజ్ షీర్ కన్నా వెళ్ళిపోవాలి. కానీ యాసిని అలా ఎక్కడికి పారిపోలేదు, వెళ్ళిపోలేదు. ఎంచక్కా కాబూల్ లోనే ఉన్నారు.

పైగా కాబూల్ ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు యాసినికే పాలనా బాధ్యతలను అప్పగించారంటేనే వాళ్ళతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అర్ధమైపోతున్నాయి. తమను వ్యతిరేకించే వాళ్ళు దొరికితే తాలిబన్లు విడిచిపెట్టే సమస్యలేదు. ఏదో కారణంతో వెంటనే కాల్చి చంపేస్తారు. అందుకనే ఘనీ దేశం విడిచి పారిపోయింది. ఆ భయం లేదుకాబట్టే యాసిని హ్యాపీగా కాబూల్ లోనే ఉన్నారు. తర్వాత కాబూల్ పాలనాబాధ్యతలను కూడా అందుకున్నారు.