Begin typing your search above and press return to search.

తాలిబన్ల చేతుల్లోకి కాబూల్.. ఆ దౌత్య కార్యాలయంపై నల్లటి పొగ.. ఎందుకలా?

By:  Tupaki Desk   |   15 Aug 2021 10:30 AM GMT
తాలిబన్ల చేతుల్లోకి కాబూల్.. ఆ దౌత్య కార్యాలయంపై నల్లటి పొగ.. ఎందుకలా?
X
అనుకున్నదే జరిగింది. అంచనాలకు మించిన వేగంతో తాలిబన్లు కాబూల్ నగరాన్ని తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా ఆఫ్గాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నగరాలన్ని తాజాగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. కాబూల్ కు అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న తాలిబన్లను తాము నియంత్రిస్తామని గొప్పగా చెప్పుకున్న దేశాధ్యక్షుడి మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే తాలిబన్ల చేతుల్లోకి కాబూల్ నగరం వెళ్లిపోయింది. దీంతో.. కాబూల్ లోని వివిధ దేశాలకు చెందిన దౌత్య సిబ్బంది తమ దేశాలకు వెళ్లిపోయేందుకు హడావుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని సురక్షితంగా అమెరికాకు తీసుకెళ్లటానికి వెయ్యి మంది ఉన్న సైనిక సిబ్బందికి అదనంగా మరో మూడు వేల మంది సిబ్బందిని పంపుతున్న కసరత్తు మరింత వేగిరం చేశారు.

చినూక్ హెలికాఫ్టర్లు అమెరికా దౌత్ కార్యాలయానికి చేరుకుంటున్నాయి. వాటి ద్వారా దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమం మొదలైంది. దీంతో.. కాబూల్ లో సైనిక హెలికాఫ్టర్ల హడావుడి ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా దౌత్య కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున నల్లటి పొగ రావటం ఆసక్తికరంగా మారింది. కీలక ఫైళ్లు.. నివేదికల్ని తగలబెట్టేస్తున్నారన్న అభిప్రాయాన్ని పరిశీలికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అమెరికా దౌత్య సిబ్బంది తరలింపునకు సంబంధించి అటు ఆఫ్గాన్ ప్రభుత్వం కానీ.. తాలిబన్లు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాబూల్ ను ఆక్రమించుకున్న వైనం చూస్తే.. ఇప్పటిదాకా తాలిబన్ల అధీనంలో లేని మరో నాలుగు రాష్ట్రాలు కూడా వారి చేతుల్లోకి వచ్చేశాయి. కాబూల్ లో ఉన్న పలు దేశాల దౌత్య సిబ్బంది తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక.. బ్యాంకుల్లో తాము దాచుకున్న డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవటానికి ప్రజలు ఏటీఎంల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నప్పటికి.. ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్థితి. దీంతో.. వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాబూల్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదు.