Begin typing your search above and press return to search.

తాలిబాన్లు ట్రంప్‌ కు లేఖ రాసేశారే!

By:  Tupaki Desk   |   15 Aug 2017 11:12 AM GMT
తాలిబాన్లు ట్రంప్‌ కు లేఖ రాసేశారే!
X
తెహ్రీక్-ఏ- తాలిబ‌న్‌... మ‌నమంతా తాలిబాన్లుగా పిలుచుకునే ఈ ఉగ్ర‌వాద సంస్థ ఇప్పుడైతే పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేదు గానీ... ఓ ప‌దేళ్ల వెన‌క్కెళితే... ఈ ఉగ్ర‌వాద సంస్థ చేసిన నిర్వాకాలు - అరాచ‌కాలు - దారుణాలు... పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశాయ‌ని చెప్పక త‌ప్ప‌దు. ష‌రియా చ‌ట్టాన్ని ప‌క్కాగా అమ‌లు చేయ‌డ‌మే త‌మ విధి అని, అల్లా త‌మ‌ను అందుకే పంపాడంటూ మీటింగులు పెట్టే ఈ ఉగ్ర‌వాద సంస్థ‌.. త‌మ ఆదేశాల‌ను ధిక్కరించే సంస్థ‌లు - వ్య‌క్తుల‌పై ముప్పేట దాడులు చేసేది. పాక్‌లో బాలిక‌లు విద్య‌న‌భ్య‌సించే విష‌యంపై తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్తం చేసిన ఈ సంస్థ‌... పాక్‌ లోని చాలా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నేల‌మ‌ట్టం చేసేసింది.

ఇదంతా గ‌త‌మైతే... ఇప్పుడు చాలా త‌క్కువ మంది సైన్యంతో ఎక్క‌డో ఆఫ్ఘ‌నిస్థాన్ - పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో మ‌నుగ‌డ సాగిస్తున్న ఈ సంస్థ‌... ఇప్పుడు మ‌రోమారు వార్తల్లోకి ఎక్కింది. ఈ ద‌ఫా ఈ సంస్థ ఏ దారుణానికో పాల్ప‌డలేదు గానీ... ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు లేఖాస్త్రం సంధించింది. ఇంగ్లీషులో 1600 పదాలతో సుదీర్ఘంగా ట్రంప్‌ కు రాసిన స‌ద‌రు లేఖ ప్ర‌తిని ఆ సంస్థ ప్ర‌తినిధి మీడియాకు విడుద‌ల చేశారు. అయినా ఆ లేఖలో ఏముంద‌న్న విష‌యానికొస్తే... అఫ్ఘానిస్తాన్‌ లో తిష్టవేసిన అమెరికా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. గత పదహారేళ్లుగా అమెరికా బలగాలు అఫ్ఘానిస్తాన్‌ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

గత అమెరికా అధ్యక్షులు అఫ్ఘానిస్తాన్‌ విషయంలో చేసిన పొరపాట్లను, తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షిస్తామనటం ద్వారా తప్పిదాలను అంగీకరించినట్లయిందని తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌ లోని బలగాల ఉపసంహరింపు విషయంలో ట్రంప్‌ ఏకపక్షంగా వ్యవహరించలేనప్పటికీ బలగాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటమో లేక ఉపసంహరించడమో చేయాలని కోరారు. బలగాలను వెనక్కి రప్పించుకోవటం ద్వారా అమెరికా దళాలకు జరిగే హాని నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.