Begin typing your search above and press return to search.

ఇండియాకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా ?

By:  Tupaki Desk   |   17 Aug 2021 7:30 AM GMT
ఇండియాకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా ?
X
పొరుగునున్న ఆఫ్ఘనిస్ధాన్ లో రెండోసారి తాలిబాన్ల శకం మొదలవ్వటంతో మనదేశానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడో దేశంలో రాజ్యాధికారంమారితే మనకేంటి సమస్య అనుకుని ప్రశాంతంగా ఉండేదుకు లేదు. ఎందుకంటే ఇప్పటికే దాయాది దేశం పాకిస్ధాన్, డ్రాగన్ దేశం సైన్యంతో జమ్మూ-కాశ్మీర్ లో పరిస్ధితులు ఎంత ఉద్రిక్తంగా మారుతోందో అందరు చూస్తున్నదే. ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబన్ల అరచాకపు పాలన మొదలైన దగ్గర నుండి అంతకన్నా ఎక్కువ ప్రమాదమే పొంచిఉంది.

ప్రమాదం ఎలా పొంచిఉందంటే తాలిబన్ల వెనుక పాకిస్ధాన్, చైనాలే ఉన్నాయి కాబట్టి. తాలిబన్లకు తెరవెనుక నుండి అవసరమైన వందలాది కోట్ల రూపాయల నిధులు, ఆయుధాలను సరఫరా చేస్తున్నది పై రెండు దేశాలేకాబట్టి. ఆఫ్ఘనిస్ధాన్లో నేరుగా తాలిబన్లు రాజ్యం చేసినా తెరవెనుక నుండి నడిపించేది పాకిస్ధాన్, డ్రాగనే అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తమకు భారత్ పై ఉన్న ధ్వేషాన్ని తాలిబన్ల ద్వారా తీర్చుకునేందుకు పై రెండుదేశాలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తాయి.

తాలిబన్ దేశంలో ఉన్న ఖనిజ, ఆయిల్, బంగారం లాంటి ప్రకృతి సంపదతో పాటు మౌళికసదుపాయాల ప్రాజెక్టులను తమ చేతుల్లోకి తీసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా ప్రయత్నాలు సక్సెస్ అయితే దానికి ప్రతిఫలంగా తాలిబన్లకు ఆయుధాలు, వందల కోట్ల రూపాయలు సమర్పించుకుంటుంది. దీంతో పాటు తమ సరిహద్దుల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులను చొరబాటుకు నూరుశాతం ప్రయత్నిస్తుంది.

ఇప్పటికైతే తాలిబన్లకు భారత్ విషయంలో కాస్త పాజిటివ్ దృక్పదమే ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ ముందు ముందు ఈ దృక్పదం ఎలాగ మారుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే భారత్ కూడా ఆఫ్ఘనిస్ధాన్లోని భారతీయులందరినీ వెంటనే దేశం విడిచి వచ్చేయమని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఆఫ్ఘన్ను వదిలి ఇప్పటికిప్పుడు భారతీయులు వచ్చేస్తే వందలాది కోట్ల రూపాయలు నష్టపోవటం ఖాయం. అంటే అక్కడి పరిస్ధితి ఎలాగుందంటే ఆఫ్ఘనిస్ధాన్లోనే ఉంటే ప్రాణాలకే గ్యారెంటీలేదు.

అలాగని అర్ధాంతరంగా వచ్చేస్తే చేస్తున్న ప్రాజెక్టులను వదులుకుంటే వందల కోట్ల రూపాయలు నష్టపోవాల్సుంటుంది. మొత్తానికి తాలిబన్ల కారణంగా ఇప్పటికే మనదేశంలో ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి. ఆఫ్ఘనిస్ధాన్లో మనవాళ్ళు సుమారు 2 వేలమందున్నారు. వాళ్ళని ఉన్నపళంగా దేశం విడిచి వచ్చేయమని కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా విమానాలు కూడా పంపుతోంది. ముందు ముందు ఇండియాలో తాలిబన్లు ఎలాంటి డేంజర్ బెల్స్ మోగిస్తారో అనే టెన్షన్ పాలకుల్లో పెరిగిపోతోంది.