Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ మా రెండో ఇల్లు.. తాలిబన్లు సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   26 Aug 2021 11:30 AM GMT
పాకిస్థాన్ మా రెండో ఇల్లు.. తాలిబన్లు సంచలన వ్యాఖ్యలు !
X
ఆఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల రాజ్యం కొనసాగుతుంది. ఆఫ్ఘన్ నుండి అమెరికా సైన్యం వెనక్కి తగ్గిన తర్వాత, ఆఫ్ఘన్ ను అతి తక్కువ సమయంలో తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ క్షణ, క్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. అలాగే ఆఫ్గనిస్తాన్ లో షరియా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే , పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు చెప్తున్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని తాలిబన్లు చెప్పారు.

భారత దేశంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఆఫ్ఘన్, పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. పాకిస్థాన్‌ తో సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌ ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు. తమ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. భారత దేశం, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని ముజాహిద్ అన్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. ఇస్లాంపై ఆధారపడిన బలమైన ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామని ముజాహిద్ చెప్పారు. ఆఫ్ఘన్లంతా ఇస్లాంలో భాగమేనని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ దళాలను ఉపసంహరించుకునే ప్రణాళికను అమెరికా ఆలస్యం చేయకూడదని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలు తమ నియంత్రణలోకి వచ్చాయన్నారు.