Begin typing your search above and press return to search.

ఇండియన్స్ టార్గెట్ చేసిన తాలిబన్లు .. భారత్ ఏంచేయబోతుంది

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:09 AM GMT
ఇండియన్స్ టార్గెట్ చేసిన తాలిబన్లు .. భారత్ ఏంచేయబోతుంది
X
అఫ్ఘన్ లో ఒక్కసారి అమెరికా బలగాలు వెనక్కి తగ్గడంతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఈ చట్టాలు, హింసకు భయపడి అప్ఘన్లు దేశం నుంచి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సరిహద్దుల్లో వేలాది మంది అఫ్ఘన్లు పక్కదేశాల ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా సరిహద్దుల్లో వేలాది మంది అఫ్ఘన్లు పడిగాపులు పడుతుండటం హృదయవిదారకంగా మారింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో తాలిబన్లు కిడ్నాపుల అంకానికి తెరలేపడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టే వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరుపడం అక్కడ కామన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుతో వారి పంథాను మార్చినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం కిడ్నాపులకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు. తాజాగా ఓ భారతీయ సిక్ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారిని తాలిబన్లు తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ ధృవీకరించారు. ఆయనను విడిపించడంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఖతర్ ప్రభుత్వం సహాయం కోరనున్నట్లు తెలుస్తోంది.

కిడ్నాప్ కు గురైన వ్యక్తి పేరు బన్ శ్రీలాల్ అని తెలుస్తోంది. ఢిల్లీలోని ఫరీదాబాద్ కు చెందిన ఆయన చాలా ఏళ్ల కిందట కాబుల్లో స్థిరపడ్డారు. అక్కడే ఆయన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ గా పని చేస్తున్నాడు. ఓ ఫార్మాసూటికల్స్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. తాలిబన్లు ఇంటింటా కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో బన్ శ్రీలాల్ వద్ద భారతీయ పాస్ పోర్టు లభించింది. దీంతో ఆయనను తుపాకులతో బెదిరించి టయోటా కారులో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనపై స్థానిక సిక్ సామాజిక వర్గ ప్రతినిధులు కాబుల్ డిస్ట్రిక్ట్-11 అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకున్నారే తప్ప దర్యాప్తును సాగించట్లేదు. దీంతో ఆయనను విడిపించేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని వారంతా కోరుతున్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో తాము సంప్రదింపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతీయులను కిడ్నాపు చేయడంతో తాలిబన్లు ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా పలుచోట్ల అఫ్ఘన్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.