Begin typing your search above and press return to search.

తాలిబన్లను పెద్దన్న ఇంతలా నమ్మారా? షాకింగ్ గా మారిన సంచలన వార్త

By:  Tupaki Desk   |   28 Aug 2021 5:32 AM GMT
తాలిబన్లను పెద్దన్న ఇంతలా నమ్మారా? షాకింగ్ గా మారిన సంచలన వార్త
X
ప్రమాదకరమైన పామును పెంచుకోవటమే పెద్ద తప్పు. దాన్ని పక్కన పెట్టుకొని నిద్రపోవటానికి మించిన పిచ్చితనం ఇంకేం ఉంటుంది. ఎవరినైతే నమ్మకూడదో వారిని నమ్మేసి.. వారి శత్రువుల వివరాల్ని వారిచేతిలో పెట్టేసి.. క్షేమంగా ఉంచమంటే.. అంతకు మించిన పిచ్చి పని ఇంకేమైనా ఉంటుందా? ప్రపంచానికి అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా.. చిన్న పిల్లాడు కూడా చేయని తప్పును పెద్దన్న చేసేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి బయటకు వచ్చిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకూ అగ్రరాజ్యం చేసిన అంత పెద్ద తప్పేమిటంటే.. ఆఫ్గాన్ రాజ్యాన్ని తాలిబన్లు అక్రమించిన క్రమంలో.. తమ వారి వివరాలతో పాటు.. గతంలో ఆప్గాన్ ప్రభుత్వానికి.. తమకు సాయంగా నిలిచిన వారికి సంబంధించిన వివరాల జాబితాను తాలిబన్ల చేతికి ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. తాము ఇచ్చిన జాబితాలోని వారికి హాని కల్పించొద్దని.. వారిని ఆఫ్గాన్ నుంచి క్షేమంగా తరలించాలని వారు కోరినట్లు చెబుతున్నారు.

అమెరికా అధికారులే స్వయంగా తాలిబన్లకు అందజేసిన నివేదికతో.. వారందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లుగా చెబుతున్నారు. తాలిబన్లకు ఆ జాబితాను ఇస్తే.. వారందరిని క్షేమంగా.. త్వరగా తరలింపు కార్యక్రమం జరుగుతుందని భావించారు. గతంలో తమను దారుణంగా దెబ్బతీసి.. నాటో దళాలకు సాయం చేసిన వారి జాబితా దొరికిన తర్వాత.. తాలిబన్లు సాయం చేస్తారన్న పిచ్చి భ్రమతో చేసిన పని.. ఇప్పుడు వారందరి ప్రాణాలకు ముప్పులా మారిందన్న ఆందోళన ఎక్కువైంది. అమెరికన్ అధికారులుస్వయంగా ఇచ్చిన లిస్టు.. కిల్ లిస్టుగా మారుతుందన్నభయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారంపెను దుమారంగా మారింది. తాలిబన్లను అమెరికా అంత గుడ్డిగా ఎలా నమ్ముతుందన్న మాటవినిపిస్తోంది. అమెరికా ప్రభుత్వం చేసిన పనిని.. పలు వర్గాల వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అమెరికా అధికారులు ఇచ్చిన జాబితాలోని వారందరికి ప్రాణాపాయం పొంచి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే..తాము చేసిన పనిని అమెరికన్లు సమర్థించుకోవటం గమనార్హం. తాము జాబితా ఇచ్చిన వారికి ఎలాంటి హాని కలిగించరన్న నమ్మకంతోనే ఇచ్చామని చెబుతున్నారు. మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నతాలిబన్లను అంత గుడ్డిగా ఎలా నమ్ముతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.