Begin typing your search above and press return to search.

బతికున్నప్పుడు పట్టలేదు చస్తే హెడ్ లైన్స్ వేశారే?

By:  Tupaki Desk   |   31 Oct 2015 7:20 AM GMT
బతికున్నప్పుడు పట్టలేదు చస్తే హెడ్ లైన్స్ వేశారే?
X
హైదరాబాద్ లోని శిల్పారామం వెళ్లిన ప్రతి ఒక్కరు ఒకచోట మాత్రం ఫోటోలు తీయించుకునేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. దేశంలోనే అత్యంత పొడగరిగా రికార్డు ఉన్న గట్టయ్య కనిపించిన వెంటనే విస్మయంతో అతనికి షేక్ హ్యండ్ ఇచ్చేసి.. అతనిపక్కన నిలుచొని ఫోటో దిగుతుంటారు.

7.6 అడుగుల ఎత్తు ఉండే గట్టయ్య పక్కన ఆరు అడుగులు దాటినోళ్లు కూడా చిన్నగా కనిపించే పరిస్థితి. ఇక.. యావరేజ్ గా ఉన్న వాళ్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతవారైనా గట్టయ్య ఎత్తు ముందు తేలిపోయేవారు. అలాంటి గట్టయ్యకు మరో రికార్డు ఉండేది. అతగాడు ఆసియా ఖండంలో రెండో పొడవైన వ్యక్తి.

బారుగా ఉండే ఇతగాడు అందరికి విచిత్రంగా కనిపించేవాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇతగాడి పక్కన నిలబడి ఫోటోలు దిగటంతో పని అయిపోయేది. వ్యక్తులు పట్టించుకోకపోవటంలో కాస్త అర్థం ఉందనుకుంటే.. ప్రభుత్వాలు కూడా ఇతగాడిని పెద్ద పట్టించుకున్నది లేదు. ఇక.. మీడియాలోనూ ఇతగాడి గురించి ఆశ్చర్యంగా రాసినోళ్లు.. ఇతడు పడిన ఇబ్బందులు మాత్రం పెద్దగా పట్టించుకునే వారు కాదు.

పొడవుగా ఉంటే ఇతనికి తరచూ అనారోగ్య సమస్యలు వేధించేవి. సరైన వైద్యం చేయించకపోవటం.. అతగాడు పెద్దగా చదువుకోకపోవటం.. పేదరికం ఇవన్నీ అతడ్ని 40 ఏళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయేలా చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా రామగుండం మండటం వుట్నూరు గ్రామానికి చెందిన గట్టయ్యకు తెలంగాణ రాష్ట్రంలోనూ న్యాయం జరగలేదన్న విమర్శ వినిపిస్తుంది.

బతికి ఉన్న సమయంలో అతని సమస్యలు ఎవరికీ పట్టకున్నా.. అనారోగ్యంతో మరణించిన ఇతగాడి మరణవార్తను మాత్రం ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా చూపిస్తున్న పరిస్థితి. బతికున్నప్పుడు.. అతగాడి సమస్యలపై కాస్త ఫోకస్ చేసినా.. గట్టయ్య ఆరోగ్యంగా ఉంటూ జీవనం సాగించేవాడని ఆయన సన్నిహితులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​