Begin typing your search above and press return to search.

పన్నీర్ ఎపిసోడ్ లో తమిళ మీడియా ఓవరాక్షన్

By:  Tupaki Desk   |   17 Feb 2017 4:44 AM GMT
పన్నీర్ ఎపిసోడ్ లో తమిళ మీడియా ఓవరాక్షన్
X
వార్తల్ని ఇవ్వగలరు కానీ వార్తల్ని సృష్టించాలనుకుంటే కుదరన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్నరాజకీయ సంక్షోభం అనంతరం పన్నీర్ కే కాదు.. మీడియాకు కూడా భారీ షాకే తగిలిందని చెప్పాలి. అమ్మ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విధేయుడు పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతి రోజున.. సమాధి దగ్గరకు వెళ్లి ధ్యానం చేసి బయటకు వచ్చి అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందంటూ మీడియాకు చెప్పినప్పటి నుంచి తమిళ మీడియా చెలరేగిపోయిందని చెప్పాలి.

శశికళ మీద కోపమో.. అమ్మ బతికి ఉన్నప్పడు తమకు దక్కని అవకాశాల్ని తమకు తామే సృష్టించుకొని చెలరేగిపోయినట్లుగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ట్రంప్ కు వ్యతిరేకంగా హిల్లరీ పక్షాన చేరిపోయి.. వార్తలు అందించే వృత్తి నుంచి.. వ్యక్తుల్ని ప్రమోట్ చేసే పనిలోకి వెళ్లిపోవటం తెలిసిందే. దీంతో.. హిల్లరీనే కాబోయే అధ్యక్షురాలని ప్రపంచాన్ని నమ్మించటమే కాదు.. చివరకు హిల్లరీకి సైతం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసి.. చివరకు ఓటమిని మూటగట్టుకునేలా చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీ పక్షాన చేరిన అమెరికన్ మీడియా ఏం చేసిందో.. ఇంచుమించు అదే తీరును ప్రదర్శించింది తమిళ మీడియా. పన్నీర్ పట్ల ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ.. అన్నాడీఎంకేలో ఆయనకున్న పట్టు అసలు లేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో పోస్టులతోనో.. ఫోన్లు చేయాలన్న ఉద్యమంతోనో అన్నాడీఎంకే నేతల మైండ్ సెట్ ను మార్చటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోయి.. పన్నీర్ పక్షాన నిలిచి.. ఆయన్ను ప్రమోట్ చేయటమే పనిగా పెట్టుకుందన్న అపవాదు మీడియా మీద పడేలా చేశారన్న విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది.

బలం లేని పన్నీర్ కు మీడియా బలంతో హైప్ క్రియేట్ చేసినా వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి. ఏ ధీమాతో అయితే పన్నీర్ అంతా తాను అనుకున్నట్లు జరుగుతుందన్నట్లు వ్యవహరించారో.. అలాంటిదేమీ జరగకపోవటాన్ని మర్చిపోకూడదు. దీనికి తోడు పన్నీర్ ను ఆకాశానికి ఎత్తేసే ప్రోగ్రాంను మొదలెట్టిన మీడియా.. చిన్నమ్మ బలాన్ని మదింపు చేసే విషయంలో పెద్ద పొరపాటే చేసింది.

దీంతో.. కాబోయే ముఖ్యమంత్రి పన్నీర్ అంటూ సాగిన ప్రచారానికి భిన్నంగా పళనిస్వామి తెర మీదకు రావటం జరిగింది. ఎంతసేపటికి శశికళ మీదున్న కోపాన్ని ప్రదర్శిస్తూ.. అక్షరాల్ని.. మాటల్ని జనాల మీదకు వదిలిన తమిళ మీడియా వాస్తవాల్ని.. వాస్తవ పరిస్థితుల్ని పెద్దగా చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. దీని కారణంగానే.. చిన్నమ్మ ప్లానింగ్ బయటకు రాలేదని చెబుతున్నారు.

పన్నీర్ భజనలో మునిగిన మీడియా.. పళని రూపంలో జరగబోయే పరిణామాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిందనే చెప్పాలి. ఆఖర్లో ఏదో జరగనుందన్న భావన అయితే తేగలిగారు కానీ.. అదే వాస్తవంగా మార్చలేకపోయారు. తమకు నచ్చినోళ్ల పక్షాన నిలిచే కన్నా.. ప్రజల పక్షాన నిలిచి.. వార్తల్ని వార్తలుగా అందించే కార్యక్రమాన్ని తమిళ మీడియా పెట్టుకొని ఉంటే.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి పన్నీర్ కాదు.. పళని అన్న విషయాన్ని ముందే గుర్తించేవారు. ఏమైనా.. తాజా ఎపిసోడ్ నుంచి మీడియా తనకు తానుగా పాఠాలు నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/