Begin typing your search above and press return to search.

ఎన్నికల షెడ్యూల్ ముంగిట తమిళనాడు సీఎం సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   26 Feb 2021 11:30 AM GMT
ఎన్నికల షెడ్యూల్ ముంగిట  తమిళనాడు సీఎం సంచలన ప్రకటన!
X
మరి కొద్ది గంటల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకి షెడ్యూల్‌ ను ప్రకటిస్తుంది అంటూ వార్తలు వస్తున్న సమయంలో తమిళనాడు సీఎం మరో కీలక ప్రకటన చేశారు. సహకార బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను రద్దు చేస్తున్నట్టు సీఎ ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. రైతులు, పేదలకు సహకార బ్యాంకులు ఇచ్చిన బంగారు అభరణాలపై రుణాలు మాఫీ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

తమిళనాడు సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఈసీ వెలువరించనుండగా.. బంగారం రుణాలను మాఫీ చేస్తూ సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. తన చర్యను సమర్థించిన పళనిస్వామి.. కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, లాక్‌డౌన్ సమయంలో కొదువ పెట్టిన బంగారాన్ని పేదలు తిరిగి పొందడానికి ఇది సహాయ పడుతుందని ఆయన అన్నారు. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర సహకార బ్యాంకు తక్కువ వడ్డీకే బంగారం రుణాలు అందజేసింది.

కేవలం 6 శాతం నామమాత్రపు వడ్డీతో మూడు నెలల కాల పరిమితితో రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చింది.కాగా, ఇటీవలే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్టు పళనిస్వామి ప్రకటించారు. మొత్తం రూ.12,000 కోట్లు రుణాలను మాఫీ చేస్తున్నామని, దీని వల్ల 16 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. రెండు రోజుల కిందట శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పూర్తిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో నిరుపేద కుటుంబాలకు ఉచిత బీమా కోసం రూ.5,000 కోట్ల తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. దీని వల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 55.7 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.