Begin typing your search above and press return to search.

హిందీ రుద్దుడు మీద స్టాలిన్ విమర్శల బాదుడు

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:19 PM GMT
హిందీ రుద్దుడు మీద స్టాలిన్ విమర్శల బాదుడు
X
హిందీ ఒక పరిపాలన భాష. అంతే. దానికి మించి ఎలాంటి ప్రాధాన్యత లేదు. హిందీని జాతీయ భాషగా పేరు చెప్పి దేశం మీద రుద్దాలని చూడవద్దు. తమిళనాడు సీఎం, డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ బీజేపీకి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇది. హిందీ ఆధిపత్యం చెల్లదు, తమిళనాడులో 1965లోనే హిందీ వద్దు అంటూ తమిళులు చేసిన ద్రవిడ ఉద్యమం గుర్తుందా అని అయన బీజేపీ ఏలికలను ప్రశ్నించారు. నాడు తమ జీవితాలను కూడా తమిళులు త్యాగం చేశారంటే తమిళ భాష మీద వారికి ఉన్న ప్రేమ ఎంతో చూడాలని అన్నారు.

స్టాలిన్ ఇలా మండిపడడానికి కారణం బీజేపీ పెద్ద, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా చేసిన ఒక కీలక‌ ప్రసంగం, అలాగే చేసిన కామెంట్స్. హిందీతోనే దేశాన్ని చూడగలమని, అసలైన భారతదేశం హిందీలోనే ఉందని షా అభిప్రాయపడినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే కాదు హిందీ అధికార భాషగా యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని షా చెప్పుకొచ్చారు.

దీంతో మంటెత్తిన డీఎంకే ప్రెసిడెంట్ ఒక ప్రకటనను విడుదల చేస్తూ హిందీ అధికార భాష కానే కాదు, జస్ట్ పాలనాపరమైన భాష మాత్రమే సుమా అని పేర్కొన్నారు. ఇక దేశంలో సెప్టెంబర్ 14న కేవలం హిందీ భాషను అధికార భాషగా ప్రకటించి దినోత్సవాలు చేయడమేంటి అని నిలదీశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం దేశంలోని మొత్తం 22 భాషలను అధికారిక భాషలుగా ప్రకటించి సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్‌ను భారతీయ భాషల దినోత్సవంగా పేరు మార్చాలని డిఎంకె అధ్యక్షుడు హోదాలో స్టాలిన్ డిమాండ్ చేశారు.

మనది భారత దేశం, ఇండియా ఇది. హిందియా కానే కాదు అని స్టాలిన్ సెటైర్లు వేశారు. ఆనాటి ప్రధాని నెహ్రూ ఇలాంటి ప్రమాదం ఊహించే హిందీతో పాటు ఇంగ్లీష్ ని కూడా అధికార భాషగా చేసి ఇతర భాషలకు రక్షణ కవచంగా ఏర్పాటు చేశారని కొనియాడారు.

ఇక తమిళ భాష నాయకత్వాన ద్రవిడ భాషా కుటుంబం దేశాల ఎల్లలను దాటి విస్తరించిన సంగతిని చరిత్రకారులు ఏనాడో చాటారని అన్నారు. ఇదేశ సంస్కృతి, చరిత్రను నిజంగా అర్థం చేసుకోవడానికి దేశం యొక్క దక్షిణ భాగం నుండి దేశ చరిత్రను తిరిగి వ్రాయాలని పరిశోధకులు కోరుకుంటున్నారని కూడా స్టాలిన్ చెప్పడం విశేషం. ఢిల్లీ నాయకుల ఆధిపత్య ధోరణి వల్లనే తమిళం సహా అనేక భాషలలో ఉన్న గొప్ప సాహిత్యం వాటి వైభవం పూర్తిగా పక్కకు పోతున్నాయని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం హృదయం తెలుసుకోవడానికి మన కల్చర్ ను అవగాహన చేసుకోవడానికి కేవలం హిందీ భాష మాత్రమే ఆధారం అని అమిత్ షా అనడాన్ని తప్పు పట్టారు. ఇది భారత్ అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వానికే పూర్తి వ్యతిరేకమైన భావజాలమని నిప్పులు చెరిగారు. మొత్తానికి ఢిల్లీ పాలకులు హిందీ రుద్దుడు పక్కన పెట్టాలని. చేతనైతే దేశంలోని స్థానిక భాషల అభివృద్ధికి విరివిగా నిధులు ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన కోరడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.