Begin typing your search above and press return to search.

కియాతో మేం చర్చలే జరపడం లేదు: తేల్చేసిన తమిళనాడు అధికారులు

By:  Tupaki Desk   |   6 Feb 2020 7:01 PM GMT
కియాతో మేం చర్చలే జరపడం లేదు: తేల్చేసిన తమిళనాడు అధికారులు
X
కియా మోటార్స్ అంశం మరో మలుపు తిరిగింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్‌ లో వచ్చిన వార్త పెనుదుమారం రేపింది. కియా ఎక్కడకూ వెళ్లదని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేయగా - తమకు అలాంటి ఆలోచన లేదని కియా మోటార్స్ ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు. రాయిటర్స్ కథనం నేపథ్యంలో టీడీపీ - జనసేన నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇప్పుడు తమిళనాడు కూడా కియా మోటార్స్ అంశంపై స్పందించింది. అసలు కియా ప్రతినిధులతో తాము చర్చలు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ - ఇన్ వెస్ట్‌ మెంట్స్ అండ్ కామర్స్ రజత్ భార్గవ తెలిపారు. తాము కియాతో ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు వెల్లడించిందన్నారు.

పొరుగురాష్ట్రమైన తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్‌ కు మంచి సంబంధాలు ఉన్నాయని - తాము కియాతో చర్చలు జరపడం లేదని తమిళనాడు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారని రజత్ భార్గవ అన్నారు. ఈ అంశంపై కియా-తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదన్నారు.

ఏపీలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలు - విధానాలు తమకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లేకపోవడంతో కియా మోటార్స్ తమిళనాడుకు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి. దీనిని ఇటు ఏపీ ప్రభుత్వం, అటు కియా కొట్టి పారేసింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా చర్చల వార్తలను కొట్టి పారేసినట్లు ఏపీ అధికారులు వెల్లడించారు. కియా మోటార్స్ ఏపీలోని అనంతపురం జిల్లాలో 2019లో టీడీపీ హయాంలో లాంచ్ చేశారు. ఈ కంపెనీ రూ.12,900 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంట్ కారణంగా వేలాది మందికి ఉద్యోగ - ఉపాధి అవకాశాలు లభించాయి.