Begin typing your search above and press return to search.

భోజ‌నాలు పెట్టాడు.. కోటీశ్వ‌రుడ‌య్యాడు!

By:  Tupaki Desk   |   27 July 2019 5:30 PM GMT
భోజ‌నాలు పెట్టాడు.. కోటీశ్వ‌రుడ‌య్యాడు!
X
బంధువుల్ని.. స్నేహితుల్ని భోజ‌నాల‌కు ఎప్పుడు పిలుస్తారు? ఇంట్లో ఏదైనా ఫంక్ష‌న్ కానీ.. వ్ర‌తం కానీ.. ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాల‌కు పిలుస్తుంటారు. కానీ.. ఆ ఊళ్లో మాత్రం అందుకు భిన్నం. పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన‌ప్పుడు ప్ర‌త్యేకంగా భోజ‌నాల‌కు పిలుస్తారు. అలా పిలిచాం క‌దా అని తూతూ మంత్రంగా భోజ‌నాలు ఉండ‌వు. భారీగా ఖ‌ర్చు చేస్తారు. అలా భోజ‌నాలు పెట్ట‌టంతో మొత్తం ద‌రిద్రం తీరిపోవ‌ట‌మే కాదు.. ఆ దెబ్బ‌కు సంప‌న్నులుగా మారిపోతుంటారు. భోజ‌నాలు పెడితే సంప‌న్నులు ఎందుకు అవుతారు? అన్న సందేహం వ‌చ్చింది? మీ అనుమానం నిజ‌మే. ఇక్క‌డే ఉంది అస‌లు లెక్క‌. అదేమంటే..

త‌మిళ‌నాడులోని పుదుక్కోట జిల్లా కీరామంగ‌ళం అనే ఊరుంది. ఈ ఊళ్లో ఒక వింతాచారం ఉంది. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉంటే.. వారు వారి ఆత్మీయుల్ని.. బంధువుల్ని భోజ‌నాల‌కు ఆహ్వానిస్తారు. ఈ సంద‌ర్భంగా త‌మ తాహ‌తుకు త‌గ్గ‌ట్లుగా భోజ‌న ఏర్పాట్లు భారీగా చేస్తారు. భోజ‌నానికి వ‌చ్చిన వారు ఉత్త చేతుల‌తో కాకుండా భారీ న‌జ‌రానాలు ప‌ట్టుకొని వ‌స్తారు. తాజాగా పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న రైతు కృష్ణ‌మూర్తి ఒక‌రు ఇలానే భోజ‌నాలు ఏర్పాటు చేశారు.

భోజ‌నాల‌కు వ‌చ్చిన బంధువులు.. ఆత్మీయులు.. మిగిలిన వారంతా త‌మ తాహ‌తుకు త‌గ్గ‌ట్లుగా చ‌దివింపులు చ‌దివించి వెళ్లిపోయారు. తీరా.. వారు ఇచ్చిన కానుక‌ల విలువ లెక్కేస్తే.. స‌ద‌రురైతు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎందుకంటే.. స‌ద‌రు రైతుకు వ‌చ్చిన కానుక‌ల విలువ ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.4కోట్లు. ఇంత‌కీ భోజ‌నాల కోసం స‌ద‌రు రైతు చేసిన ఖ‌ర్చు రూ.15ల‌క్ష‌లు. తాను పెట్టిన ఖ‌ర్చుకు ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తాన్ని కానుక‌ల‌తో త‌న వాళ్లు తన‌కు ఇచ్చినందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు కృష్ణ‌మూర్తి.

మ‌రో విశేషం ఏమంటే.. అతిధులు తీసుకొచ్చిన కానుక‌ల్ని లెక్కించ‌టం కోసం ఆయ‌న ఇంటికి స‌మీపంలో ఉన్న బ్యాంకు నుంచి క‌రెన్సీ మిష‌న్ తెచ్చి మ‌రీ లెక్క పెట్టారు. ఈ ఒక్క విందుతో త‌న‌కున్న ఆర్థిక‌క‌ష్టాల‌న్ని తీరిపోవ‌ట‌మే కాదు..కోటీశ్వ‌రుడ్ని చేసింద‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు. ఇలాంటి సంప్ర‌దాయాన్ని అంద‌రూ ఫాలో అయితే ఎంత బాగుంటుందో క‌దా?