Begin typing your search above and press return to search.

సీఎం స్టాలిన్ కు ఆర్థిక సలహాదారుగా నోబెల్ గ్రహీత

By:  Tupaki Desk   |   21 Jun 2021 11:30 PM GMT
సీఎం స్టాలిన్ కు ఆర్థిక సలహాదారుగా నోబెల్ గ్రహీత
X
తమిళనాడు సీఎంగా గద్దెనెక్కగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టాలిన్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళనాడు సీఎంగా గత నెలలోనే బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పాలనలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలతో శభాష్ అనిపించుకుంటున్నారు.

తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఐదుగురు ప్రపంచం గర్వించే ఆర్థిక వేత్తలతో ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేసి సంచలనం సృష్టించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఎస్తేర్ డుఫ్లో, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ వంటి ఆర్థిక వేత్తలు ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆర్థిక, సామాజిక విధానాలపై ఈ కౌన్సిల్ సలహాలు, సూచనలు చేయనుంది. ఎస్తేర్ డుఫ్లో, రఘురామ రాజన్ సహా మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, సామాజిక శాస్త్రవేత్త జీన్ డ్రేజే, కేంద్రఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.నారాయణ్ సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రకటిస్తూ తమిళనాడు ఆర్థిక పరిస్థితి నిరంతరం అధిక ఆదాయాలు, ద్రవ్యలోటు, పెద్దమొత్తంలో అప్పులతో ప్రమాదకరంగా ఉంది. అదే సమయంలో ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వేగవంతమైన అభివృద్ధి, ఆర్థికవృద్ధి సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రభుత్వం అందజేయనుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలను సీఎం స్టాలిన్ తన తమిళనాడు రాష్ట్రం కోసం కౌన్సిల్ లో సభ్యులుగా నియమించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం అని పేర్కొంటున్నారు.