Begin typing your search above and press return to search.

మూఢ‌న‌మ్మ‌కం: వ‌ర్షం కోసం ఏం చేశారంటే

By:  Tupaki Desk   |   10 Oct 2017 5:19 AM GMT
మూఢ‌న‌మ్మ‌కం: వ‌ర్షం కోసం ఏం చేశారంటే
X
వ్య‌వ‌సాయ ఆధారిత‌మైన మ‌న దేశంలో వ‌ర్షాల కోసం జ‌నాలు అల్ల‌డిపోతారు. వ‌ర్షం లేనిదే ముద్ద నోట్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితులు మ‌నం ఎన్నో ఎదుర్కొన్నాం. ఈ క్ర‌మంలోనే స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని, పంట‌లు బాగా పండాల‌ని మ‌న పెద్ద‌వాళ్లు దేవుళ్ల‌కు మొక్కుతూనే ఉంటారు. ఒక‌వేళ ఏదైనా కార‌ణాల రీత్యా వ‌ర్షాలు కుర‌వ‌క‌పోతే.. పూజ‌లు, హోమాలు స‌ర్వ‌సాధార‌ణం. వ‌రుణ యాగ‌మ‌ని, క‌ప్ప‌ల పెళ్లిళ్ల‌ని ఇలా ఎన్నో ర‌కాలుగా ప్రార్థ‌న‌లు, పూజ‌లు చేయ‌డం మ‌న‌కు కొత్త‌కాదు. అయితే, త‌మిళ‌నాడులోని ఓ ప్రాంతంలో ఈ ఏడాది వ‌ర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఆ ప్రాంతంలో పంట‌లు చేతికి అందుతాయో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి దాపురించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఎదురు చూసిన స్థానికులు ఇక‌, ఆశ‌లు వ‌దులుకున్నారు.

ఈ క్ర‌మంలోనే వారు వరుణ దేవుణ్ణి ప్ర‌స‌న్నం చేసుకునేందుకు మూఢ‌న‌మ్మ‌కాల‌కు తెర‌లెత్తారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్షాల కోసం చేయ‌ని విధంగా వ్య‌వ‌హ‌రించారు. తమ ప్రాంతంలో వ‌ర్షాల కోసం త‌మిళ‌నాడులోని ఆరల్‌ వాయ్‌ మొలి, తోవాలై, షెన్బగరాయన్ పుదూర్ తో పాటు ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించారు. వీరి తీరు చూస్తే భార‌త్‌లో ఇంకా మూఢ న‌మ్మ‌కాలు ఎంత బ‌లంగా ఉన్నాయో తెలుస్తుంది. త‌మ ప్రాంతంలో వ‌ర్షాలు ప‌డాల‌ని ఓ మహిళ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వ‌హించారు. ఆ బొమ్మ మృత‌దేహంతో ముందుకు వెళుతూ మహిళలంతా క‌లిసి వర్షాలు కురవాలంటూ బోరున విల‌పించారు.

ఇలా చేస్తే వ‌ర్షం ప‌డుతుంద‌ని అమాయ‌కంగా చెబుతున్నారు. ఆ బొమ్మ‌ను ఊరి పొలిమేరల్లో దహనం చేశారు. అనంత‌రం అంద‌రూ క‌లిసి మ‌రోసారి చితి చుట్టూ చేరి భోరున ఏడుస్తూ.. ఆకాశం వంక చూస్తూ.. ద‌ణ్ణాలు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జ‌నాలు పోగ‌య్యారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు హ్యాపీగా ఫీల‌వుతుంటే.. సామాజిక‌, అభ్యుద‌య వాదులు మాత్రం ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. క‌నీస అవ‌స‌రాల‌కు కూడా ప‌ళ‌ని ప్ర‌భుత్వం నీరివ్వ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సో.. ఇదీ మూఢ‌న‌మ్మ‌కాల క‌థ‌!!