Begin typing your search above and press return to search.

పెప్సీ, కోక్ బంద్‌...వెయ్యి కోట్ల న‌ష్టం

By:  Tupaki Desk   |   1 March 2017 11:43 AM GMT
పెప్సీ, కోక్ బంద్‌...వెయ్యి కోట్ల న‌ష్టం
X
నేటి నుంచి పెప్సీ - కోక్ బంద్‌. అయితే అది మ‌న ద‌గ్గ‌ర కాదులేంది. పొరుగున ఉన్న త‌మిళ‌నాడులో. ఆ రాష్ట్రంలో బుధ‌వారం నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ - కోక్‌ల‌ను త‌మిళ‌నాడు వ్యాపారులు బ‌హిష్క‌రించారు. త‌ద్వారా టాప్‌ సాఫ్ట్ డ్రింక్ ల్లో టాప్‌లో ఉన్న పెప్సీ, కోక్‌ల‌కు షాకిచ్చారు. స్థానిక త‌యారీదారుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో వాళ్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పెప్సీ, కోక్‌ల‌కు రూ.1400 కోట్ల మేర న‌ష్టం వాటిల్ల‌నుంది.

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘమైన‌ త‌మిళ‌నాడు వానిగ‌ర్ సంగ‌మ్ పెప్సీ, కోక్‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంఘంలో ఆరు వేల‌కుపైగా చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా దుకాణాలు, 15 ల‌క్ష‌ల‌కుపైగా స‌భ్యులు ఉన్నారు. చిన్న‌చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ కోలాలు అమ్మ‌బోర‌ని ఆ సంఘం స్ప‌ష్టంచేసింది. పెద్ద‌పెద్ద సూప‌ర్‌మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత స‌మ‌యం కావాల‌ని అడిగినా.. తాము అంగీక‌రించ‌లేద‌ని, సాయంత్రం దీనిపై స‌మావేశం కాబోతున్నామ‌ని ఆ సంఘం వెల్ల‌డించింది. గ‌త జ‌న‌వ‌రి నెల‌లో జ‌ల్లిక‌ట్లు కోసం జ‌రిగిన ఉద్య‌మం సంద‌ర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఎంఎన్‌సీ సాఫ్ట్‌డ్రింక్స్ వ‌ల్ల స్థానిక త‌యారీదారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని, ఈ విదేశీ సంస్థ‌లు విలువైన నీటి సంప‌ద‌ను కూడా దోచుకుంటున్నాయ‌ని సంఘం కార్య‌ద‌ర్శి కే మోహ‌న్ అన్నారు. రాష్ట్రం క‌రువు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంఎన్‌సీ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు నీటిని దోచుకోవ‌డాన్ని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలో తాము ఓ ముంద‌డుగు వేసిన‌ట్లు వివ‌రించారు.